నేటి మ్యాచ్‌లో గెలుపుపై అఫ్రిది అభిప్రాయం ఇదిగో!

  • నేడు భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో సెమీ ఫైనల్
  • ఇంగ్లండ్‌కే గెలుపు అవకాశాలు ఎక్కువన్న అఫ్రిది
  • జోస్ బట్లర్ సేన కూర్పు బాగుందన్న పాక్ మాజీ క్రికెటర్
  • మైదానంలో రాణించే జట్టుకే గెలుపు అవకాశాలుంటాయన్న అఫ్రిది
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు కీలక పోరు జరగనుంది. భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య నేడు జరగనున్న సెమీ ఫైనల్‌లో విజయం సాధించి ఫైనల్‌కు వెళ్లేదెవరన్న దానిపై ఇప్పటికే బోల్డన్ని ఊహాగానాలున్నాయి. రెండు బలమైన జట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్‌లో విజయం సాధించే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయన్న దానిపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది స్పందించాడు. 

పాకిస్థాన్‌కు చెందిన ‘సామా టీవీ’తో మాట్లాడుతూ.. ఇండియాతో పోలిస్తే ఇంగ్లండ్‌కే ఎక్కువ అవకాశాలున్నాయని అన్నాడు. భారత జట్టుతో పోలిస్తే జోస్ బట్లర్ సేన కూర్పు బాగుందని, నేటి మ్యాచ్‌లో విజయం సాధించే అవకాశం 60-65 శాతం ఆ జట్టుకే ఉందని అభిప్రాయపడ్డాడు. రెండు జట్లు సమానంగా ఉన్నాయని, ఈ టోర్నీలో మంచి ప్రదర్శన చేశాయని అఫ్రిది అన్నాడు. 

అయితే, తన ఆప్షన్ మాత్రం ఇంగ్లండేనని చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా చూస్తే ఇంగ్లండ్ మెరుగ్గా ఉందని అన్నాడు. ఇంగ్లండ్‌కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాను చెప్పినప్పటికీ, మైదానంలో ఈ రెండు జట్లు తమ ప్రణాళికను ఎలా అమలు చేస్తాయన్న దానిపైనే విజయం ఆధారపడి ఉంటుందన్నాడు. ఇది పెద్ద మ్యాచ్‌ కాబట్టి పొరపాట్లు తక్కువగా ఉంటాయని, 11 మంది ఆటగాళ్లు గెలుపు కోసం 100 శాతం ప్రయత్నిస్తారని అన్నాడు. కాగా, నిన్న జరిగిన తొలి సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించిన పాకిస్థాన్ ఫైనల్‌కు చేరుకుంది.


More Telugu News