అమెరికాలో చరిత్ర సృష్టించిన తెలుగు మహిళ... మేరీలాండ్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా ఎన్నిక
- మేరీలాండ్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఎన్నికల బరిలోకి దిగిన అరుణా మిల్లర్
- అమెరికా చరిత్రలో లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా నెగ్గిన తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డు
- విపక్ష రిపబ్లికన్ల మద్దతునూ సాధించేలా ప్రచారం చేసిన వైనం
అమెరికా ఎన్నికల చరిత్రలో ఓ తెలుగు మహిళ చరిత్ర సృష్టించారు. తెలుగు నేపథ్యం ఉన్న అరుణా మిల్లర్ మేరీలాండ్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా ఎన్నికయ్యారు. మేరీలాండ్ ప్రజల్లో అపార ఆదరణ కలిగిన అరుణా మిల్లర్... ఆ దేశ మధ్యంతర ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్ అభ్యర్థిగా లెప్ట్ నెంట్ గవర్నర్ పదవి కోసం బరిలో దిగారు. మంగళవారం పోలింగ్ పూర్తి కాగా... బుధవారం వెలువడిన ఫలితాల్లో అరుణా మిల్లర్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా విజయం సాధించారు.
అరుణా మిల్లర్ గెలుపు కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మేరీలాండ్ లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ క్రమంలో డెమోక్రాట్లతో పాటు విపక్ష రిపబ్లికన్ల మద్దతు కూడా కూడగట్టిన అరుణా మిల్లర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. తనదైన శైలి ప్రచారంతో తనతో పాటు మేరీలాండ్ గవర్నర్ పదవికి పోటీ చేసిన డెమోక్రటిక్ అభ్యర్థి వెస్ మూర్ కూ విజయం దక్కేలా చేశారు. ఈ ఎన్నికతో అమెరికాలో లెఫ్ట్ నెంట్ గవర్నర్ పదవి చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా అరుణా మిల్లర్ చరిత్ర సృష్టించారు.