మహిళల ఐపీఎల్​ లో జట్టును కొంటా: మిథాలీ రాజ్​

  • లీగ్ లో భాగం అయ్యేందుకు అన్ని ఆప్షన్లను ఓపెన్ గా ఉంచానని చెప్పిన దిగ్గజ క్రికెటర్
  • ప్లేయర్, మెంటార్, జట్టు యజమాని.. ఏ పాత్రకైనా సిద్ధమే అని వెల్లడి
  • ఈ మధ్యే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ
భారత మహిళల క్రికెట్ జట్టుకు రెండు దశాబ్దాల పాటు సేవలందించి, ఈ మధ్యే ఆటకు వీడ్కోలు పలికిన దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ మళ్లీ మైదానంలోకి వచ్చేందుకు సిద్ధం అవుతోంది. వచ్చే ఏడాది మార్చిలో మొదలయ్యే మహిళల ఐపీఎల్ లో భాగం అయ్యేందుకు ఉత్సాహం చూపిస్తోంది. ఈ లీగ్ లో ఓ క్రికెటర్ గా ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పిన మిథాలీ మెంటార్ గా జట్టును నడిపించేందుకైనా, ఓ ఫ్రాంచైజీని కొనుగోలు చేసి యజమానిగా ఉండేందుకైనా రెడీ అని స్పష్టం చేసింది. తాను అన్ని ఆప్షన్లను ఓపెన్ గా ఉంచానని తెలిపింది. 

ఈ విషయమై మిథాలీ మాట్లాడుతూ ‘వచ్చే ఐపీఎల్ లో ఏ పాత్రను పోషించేందుకైనా నేను సిద్ధమే. అన్ని ఆప్షన్లు తెరిచే ఉంచా. ప్లేయర్ గా అయినా, మెంటార్ గా అయినా సరే లీగ్ లో భాగం అవుతా. కానీ ప్రస్తుతానికి ఏదీ స్పష్టంగా లేదు. లీగ్ లో ఐదు జట్లను ఎలా సిద్ధం చేయబోతున్నారు? బిడ్డింగ్ ద్వారా క్రికెటర్లను తీసుకుంటారా? లేక వేలంలో కొనుగోలు చేస్తారా? అనే విషయాలు తెలియాలి. కాబట్టి కొంత కచ్చితమైన సమాచారం లభించే వరకు నేను నా తలుపులను తెరిచే ఉంచుతాను. ఒక జట్టును సొంతం చేసుకునే అవకాశం లభిస్తే దాన్ని సద్వినియోగం చేసుకునేందుకూ సిద్ధంగానే ఉన్నాను’ అని చెప్పుకొచ్చింది.


More Telugu News