గ్రహణ సమయంలో భోజనం చేస్తూ అవగాహన పెంచే ప్రయత్నం.. వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన హిందూ సంస్థలు

  • నిన్న దేశవ్యాప్తంగా చంద్రగ్రహణం
  • గ్రహణ సమయంలో భోజనాలు చేసేందుకు ప్రయత్నించిన హేతువాద సంస్థ హెచ్ఆర్ఓ
  • నిరసన తెలిపిన బ్రాహ్మణ సంఘాలు, భజరంగ్‌దళ్, వీహెచ్‌పీ
  • పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి పోలీసులు
  • లాఠీలకు పనిచెప్పి ఇరు వర్గాలను చెదరగొట్టిన వైనం
దేశవ్యాప్తంగా నిన్న కనిపించిన చంద్రగ్రహణం ఒడిశాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సాధారణంగా గ్రహణ సమయంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉంటారు. ఆ సమయంలో భోజనాలు చేయడాన్ని ఇష్టపడారు. కొందరైతే గ్రహణం విడిచే వరకు నీళ్లు కూడా తాగరు. ఇక గర్భిణులు అయితే మరింత జాగ్రత్తగా ఉంటారు. పుట్టే బిడ్డలపై గ్రహణ శూల ఉండకూడదని పలు జాగ్రత్తలు తీసుకుంటారు. పాత్రలపై మూతలు పెట్టడం, తలుపులకు గడియ వేయడం, తీయడం వంటి వాటిని చేయరు. అయితే, ఇవన్నీ అపోహలు, భయాలు మాత్రమేనని హేతువాదులు చెబుతారు. నిత్యం ఎలా ఉంటామో, గ్రహణ సమయంలోనూ అలానే ఉండొచ్చని, గ్రహణం వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉండవని చెబుతారు.

గ్రహణంపై ఉన్న అపోహలు, భయాలను తొలగించేందుకు హేతువాద సంస్థలు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటాయి. ఒడిశాలోని గంజాం జిల్లాలో ఇలా నిర్వహించిన అవగాహన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ‘మానవతావాది హేతువాద సంస్థ’(హెచ్ఆర్ఓ) గంజా జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిన్న గ్రహణ సమయంలో భోజనాలు చేస్తూ ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేసింది. హెచ్ఆర్ఓ ప్రతినిధులు సిటీ హైస్కూలు రోడ్డులోని చార్‌వాక్ భవన్ వద్ద ప్రజా చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు. విషయం తెలిసిన గంజాం జిల్లా బ్రాహ్మణ పురోహిత సమితి, భజరంగ్‌దళ్, విశ్వహిందూ పరిషత్ తదితర సంస్థలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించాయి. 

హెచ్ఆర్ఓ సంస్థ చేపట్టిన అవగాహన కార్యక్రమానికి వ్యతిరేకంగా ఓ సంస్థ రామలింగం ట్యాంకు రోడ్డులోని ఎత్తయిన హనుమాన్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టింది. మరికొందరు చార్‌వాక్ భవన వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం కర్రలతో చార్‌వాక్ భవన్ వద్దకు చేరుకుని హెచ్ఆర్ఓ ప్రతినిధులతో వాగ్వివాదానికి దిగారు. ఆపై వారి మధ్య తోపులాట చోటుచేసుకుంది. మరికొందరు పేడతో హెచ్ఆర్ఓ ప్రతినిధులపై దాడిచేశారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. 

సమాచారం అందుకున్న పోలీసులు లాఠీలు ఝళిపించి ఇరు వర్గాలను చెదరగొట్టారు. అయినప్పటికీ మళ్లీ అక్కడికి చేరుకున్న ఆయా సంస్థల ప్రతినిధులు హెచ్ఆర్ఓకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చివరికి హెచ్ఆర్ఓ ప్రతినిధులకు పోలీసులు నచ్చజెప్పి భద్రత మధ్య వారిని అక్కడి నుంచి వాహనాల్లో తరలించారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ ఘటనపై హెచ్ఆర్ఓ ప్రతినిధులు తీవ్రంగా స్పందించారు. గ్రహణ భోజనాన్ని అడ్డుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


More Telugu News