సూర్యకుమార్ యాదవ్ ఏం తింటాడో చెప్పిన న్యూట్రిషనిస్టు

  • అంతర్జాతీయ క్రికెట్లో మోత మోగిస్తున్న సూర్యకుమార్  
  • టీ20 క్రికెట్లో నం.1గా ఎదిగిన వైనం
  • బౌలర్లను హడలెత్తించే బ్యాటర్ గా గుర్తింపు
  • ఏడాదిగా శ్వేతా భాటియా పర్యవేక్షణలో డైట్
సూర్యకుమార్ యాదవ్ అలియాస్ స్కై (SKY)... ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో మార్మోగుతున్న పేరు ఇదే. పరిమిత ఓవర్ల క్రికెట్ లో ముఖ్యంగా టీ20 క్రికెట్ లో విశ్వరూపం ప్రదర్శిస్తున్న ఆటగాడు సూర్యకుమార్ యాదవ్. బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యంగా బరిలో దిగే సూర్య ధాటికి బౌలర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ దూకుడు వీర లెవల్లో కొనసాగుతోంది. 

సాధారణంగా క్రికెటర్ల ఉచ్ఛస్థితి 20 నుంచి 30 ఏళ్ల మధ్యలో కొనసాగుతుంది. ఈ సూత్రం సూర్యకుమార్ యాదవ్ కు వర్తించదు. జట్టులోకి కాస్త ఆలస్యంగా ఎంపికైన ఈ ముంబయి వీరుడు... ప్రస్తుతం 32వ పడిలో ఉన్నాడు. అయితేనేం, ఆటకు వయసు అడ్డంకి కాదని నిరూపిస్తూ సంచలన బ్యాటింగ్ తో టీ20 ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ గా ఎదిగాడు. 

ఇక అసలు విషయానికొస్తే... క్రికెటర్లకు ఫిట్ నెస్ ఎంతో అవసరం. అంతర్జాతీయ స్థాయి క్రికెట్లో కొనసాగాలంటే 100 శాతం ఫిట్ గా ఉండడం తప్పనిసరి. సూర్యకుమార్ కూడా ఫిట్ నెస్ కోసం ఎంతో శ్రమిస్తుంటాడు. ఆహార పరంగానూ తనకు నచ్చిన వంటకాలను త్యాగం చేసి, పర్సనల్ న్యూట్రిషనిస్టు ఏం చెబితే అదే తింటూ, శారీరక దారుఢ్యాన్ని కాపాడుకుంటున్నాడు. 

ప్రముఖ డైటీషియన్, స్పోర్ట్స్ న్యూట్రిషనిస్టు శ్వేతా భాటియా గత ఏడాదికాలంగా సూర్యకుమార్ యాదవ్ డైట్ మెనూ పర్యవేక్షిస్తున్నారు. సూర్య తీసుకునే ఆహారం గురించి ఆమె ఆసక్తికర వివరాలు పంచుకున్నారు. 

"ఒక సంవత్సరం నుంచి మేం సూర్యతో పనిచేస్తున్నాం. ఓవరాల్ ఫిట్ నెస్ పరంగా అతడు ఎంతో మెరుగయ్యాడు. స్పోర్ట్స్ న్యూట్రిషన్ పై ఎలాంటి అవగాహన ఉండాలో అతడికి వివరించాం. 

సూర్య డైట్ ప్లాన్ ఐదు అంశాలను ప్రభావితం చేసేలా ఉంటుంది. 

1. ప్రాక్టీసులోనూ, మ్యాచ్ ల్లోనూ మెరుగైన పెర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు డైట్ తోడ్పడాలి. 
2. ఓ అథ్లెట్ స్థాయిలో తన శరీరంలో కొవ్వు 12 శాతం నుంచి 15 శాతం మధ్యలో ఉండాలి. 
3. ఈ డైట్ ద్వారా మానసికంగా ఎంతో చురుకుదనం కనిపించాలి. 
4. తిండి యావను పరిమితం చేసుకోవడం ద్వారా అదే పనిగా తినడాన్ని తగ్గించుకోవడం. 
5. అలసటకు గురైనా, గాయపడినా వేగంగా కోలుకునే రీతిలో శక్తిమంతమైన డైట్ ఉండాలి. ఈ ఐదు పాయింట్లను ఆధారంగా చేసుకుని సూర్య డైట్ ను ప్లాన్ చేశాం. 

అతడిలో చురుకుదనం పాళ్లను పెంచేందుకు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని మెను నుంచి తొలగించాం. ఏ స్థాయిలో కార్బోహైడ్రేట్లు అవసరమో అంత మేరకే అందిస్తున్నాం. నట్స్, ఒమెగా-3 వంటి ఆరోగ్యకరమైన కొవ్వు ఉండే ఆహారమే అతడి మెనూలో ఉంటుంది. ఇక అధిక ప్రొటీన్ల కోసం గుడ్లు, మాంసం, చేపలు తీసుకుంటాడు. పాలు, పాల ఉత్పత్తులు, పీచుపదార్థం రూపంలో లభ్యమయ్యే తక్కువ మోతాదు కార్బోహైడ్రేట్లు, కూరగాయలు తన మెనూలో ఉండేలా చూశాం. 

ఓ అథ్లెట్ నిత్యం శ్రమిస్తుంటాడు కాబట్టి అతడి శరీరంలో తగినంతగా ద్రవపదార్థాలు, లవణాలు ఉండాలి. ఆ దిశగానే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. ఎప్పుడూ ఇదే ఆహారమా అని సూర్యకు విసుగు కలగకుండా, అప్పుడప్పుడు ప్రత్యామ్నాయ వంటకాలు అందిస్తుంటాం. శరీరం ఎప్పుడూ ఉత్తేజంతో ఉండేందుకు కాఫీ కూడా మెనూలో ఉంటుంది. కాఫీలో ఉండే కెఫీన్ శరీరానికి హుషారునిస్తుంది. 

ఇక, డిన్నర్ తర్వాత గానీ, లేక పిజ్జా, మటన్ బిర్యానీ తిన్న తర్వాత గానీ ఓ ఐస్ క్రీమ్ లాగించడం వంటి పనులకు సూర్య చాలా దూరంగా ఉంటాడు. అతడు చాలా ప్రొఫెషనల్ మైండ్ సెట్ ఉన్నవాడు. తన ఆట కంటే ఏదీ ముఖ్యం కాదని భావిస్తాడు. అందుకే ఎలాంటి జంక్ ఫుడ్ జోలికి వెళ్లడు. మేం డైట్ ప్లాన్ ప్రారంభించినప్పటి నుంచి అతడు వేరే ఆహారాన్ని తీసుకోవడం ఇంతవరకు చూడలేదు" అని శ్వేతా భాటియా వివరించారు.


More Telugu News