ఈ నెల 12న ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన... రామగుండం వస్తే అగ్నిగుండమేనన్న విద్యార్థి జేఏసీ

  • తెలుగు రాష్ట్రాల పర్యటనకు వస్తున్న మోదీ
  • ఈ నెల 11న ఏపీలో పర్యటన
  • మరుసటి రోజు తెలంగాణ రాక
  • రామగుండంలో ఎరువుల పరిశ్రమ ప్రారంభోత్సవం
ప్రధాని నరేంద్ర మోదీ ఈ వారాంతంలో తెలుగు రాష్ట్రాల పర్యటనకు వస్తున్నారు. ఈ నెల 11న ఏపీలో పర్యటన అనంతరం, 12వ తేదీన తెలంగాణలో పర్యటించనున్నారు. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం వద్ద ఉన్న ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయనున్నారు. 

అయితే, ప్రధాని పర్యటనపై తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల జేఏసీ భగ్గుమంటోంది. మోదీ రామగుండం వస్తే అగ్నిగుండమేనని విద్యార్థి జేఏసీ నేతలు హెచ్చరించారు. యూనివర్సిటీ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు అంశంలో అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపకపోవడంపై విద్యార్థి జేఏసీ కొన్నిరోజులుగా ఆందోళనలు చేపడుతోంది. 

కేంద్రం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని, మోదీ తెలంగాణ వస్తే తాము అడ్డుకుంటామని విద్యార్థి జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రారంభమైన పరిశ్రమను మళ్లీ ప్రారంభించడం ఏంటని ప్రశ్నించారు. ఇదంతా తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికేనని విమర్శించారు.


More Telugu News