స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌ కు రాజేష్ టచ్‌రివర్ 'దహిణి'

  • మంత్రగత్తెల పేరిట అమాయకుల బలి
  • దేశంలో వేల సంఖ్యలో ఘటనలు
  • తన్నిష్ఠ ఛటర్జీ, జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో దహిణి
  • ఈ చిత్రానికి అంతర్జాతీయ గుర్తింపు
తన్నిష్ఠ ఛటర్జీ, జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలలో జాతీయ పురస్కార గ్రహీత, ప్రముఖ దర్శకుడు రాజేష్ ట‌చ్‌రివ‌ర్‌ తెరకెక్కించిన సినిమా 'దహిణి'. ఈ చిత్రం స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైంది. ఈ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు దక్కడం ఇది రెండోసారి. ఈ చిత్రానికి పసిఫిక్ బీచ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్' అవార్డు లభించింది. 

వాస్తవ ఘటనల ఆధారంగా చిత్రాలను తెరకెక్కించే రాజేష్ ట‌చ్‌రివ‌ర్‌, ఇప్పుడు 'విచ్ హంటింగ్ (మంత్రగత్తెలుగా అనుమానించి హతమార్చడం)' పేరిట పలు రాష్ట్రాలలో జరుగుతున్న దారుణాలను 'దహిణి' సినిమా ద్వారా వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఒరిస్సాలోని మయూర్ బంజ్ జిల్లా, పరిసర ప్రాంతాల్లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా, వాస్తవికతకు దగ్గరగా 'దహిణి' చిత్రాన్ని రూపొందించారు. 

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) ప్రకారం... మన దేశంలో 2001 నుండి 2019 వరకు దాదాపు 2937 మంది మంత్రవిద్యలు చేస్తున్నారనే అనుమానంతో దారుణంగా చంపబడ్డారు. ఈ పాయింట్ ను ఆధారంగా చేసుకుని రాజేష్ టచ్ రివర్ దహిణి చిత్రాన్ని తెరకెక్కించారు. 

ఈ చిత్రంలో ఆషిక్ హుస్సేన్, బద్రుల్ ఇస్లాం, అంగన రాయ్, రిజు బజాజ్, జగన్నాథ్ సేథ్, శ్రుతి జయన్ దిలీప్ దాస్‌, దత్తాత్రేయ తదితరులు నటించారు. ఓరియన్ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, సన్‌టచ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను పద్మశ్రీ అవార్డు గ్రహీత, మానవతావాది సునీత కృష్ణన్, ప్రదీప్ నారాయణన్ సంయుక్తంగా నిర్మించారు.


More Telugu News