ఇండియాలో తొలి ట్విట్టర్ యూజర్ ఎవరో తెలుసా?.. బ్లూ టిక్ కు డబ్బులు చెల్లించడంపై ఆమె ఏమన్నారు?

  • ఇండియాలో తొలి ట్విట్టర్ యూజర్ నైనా రెఢూ
  • ప్రస్తుతం జైసల్మేర్ లో హోటల్ లో పని చేస్తున్న నైనా
  • ఇప్పుడు ఏదైనా మెసేజ్ పెట్టాలంటే చాలా ఆలోచించాల్పి వస్తోందని వ్యాఖ్య
ప్రపంచ శ్రీమంతుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను సొంతం చేసుకున్న తర్వాత ఆ సంస్థలో సమూల మార్పులు జరుగుతున్నాయి. కాస్ట్ కటింగ్ పేరుతో ఎంతో మంది ఉద్యోగులను ఆయన తొలగిస్తున్నారు. ఇదే సమయంలో బ్లూ టిక్ కలిగి ఉండే యూజర్లపై నెలకు 8 డాలర్ల భారాన్ని ఆయన మోపబోతున్నారు. ఈ నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

ట్విట్టర్ తాజా పరిణామాలపై మన దేశంలో ట్విట్టర్ తొలి యూజర్ నైనా రెఢూ స్పందించారు. తొలి నాళ్లలోనే ఆమె ట్విట్లర్ బ్లూ టిక్ పొందింది. 2006లో ఆమె ఆర్కుట్ లో కొనసాగుతున్నారు. ఆ సమయంలో ఆమెకు ట్విట్టర్ నుంచి మెయిల్ వచ్చింది. అప్పటికి ట్విట్టర్ ఇంకా అధికారికంగా లాంచ్ కాలేదు. కొత్త సామాజిక మాధ్యమమైన ట్విట్టర్ లోకి లాగిన్ కావాలని ఆమెకు మెయిల్ వచ్చింది. ఎలా ఉంటుందో చూద్దామని ఆమె ట్విట్టర్ లోకి సైనిన్ అయింది. 

దీనిపై ఆమె తాజాగా స్పందిస్తూ... ట్విట్టర్ ఇంత పెద్ద సోషల్ మీడియాగా ఎదుగుతుందని అప్పట్లో తాను భావించలేదని తెలిపింది. తొలినాళ్లలో ఇండియాలో ట్విట్టర్ కు పెద్దగా స్పందన లేదని చెప్పింది. అప్పట్లో కేవలం ట్విట్టర్ ఉద్యోగులు, వారి స్నేహితులు మాత్రమే అందులో ఉన్నారని తెలిపింది. తాను అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పటికీ, ఆ తర్వాత దాదాపు ఏడాదిన్నర పాటు దాన్ని ఉపయోగించలేదని చెప్పింది. ప్రస్తుతం నైనా ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంది. ఇప్పటి వరకు ఆమె 1.75 లక్షల ట్వీట్లు చేసింది. 

బ్లూ టిక్ కు డబ్బులు చెల్లించడంపై ఆమె స్పందిస్తూ... దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదని చెప్పింది. ప్రజల్ని ప్రభావితం చేయగల వ్యక్తులా? అని తెలుసుకోవడానికి ఇప్పటి వరకు బ్లూ టిక్ ఇచ్చారని తెలిపింది. ఇప్పటి వరకు దాని కోసం ఏమీ చెల్లించలేదని... 16 ఏళ్లుగా లేనిది ఇప్పుడు ఎందుకని ప్రశ్నించింది. బ్లూ టిక్ వల్ల ఇండియాలో పెద్దగా ప్రభావం ఏమీ ఉండదని అభిప్రాయపడింది.  

తొలినాళ్లలో మన మెసేజ్ లను ఎవరు చూస్తున్నారనే విషయాన్ని పెద్దగా పట్టించుకునే వాళ్లం కాదని... ఇప్పుడు ఏదైనా మెసేజ్ పెట్టాలంటే చాలా ఆలోచించాల్సి వస్తోందని ఆమె వ్యాఖ్యానించింది. అందుకే ట్విట్టర్ వాడకాన్ని తాను బాగా తగ్గించానని తెలిపింది. బ్లూ టిక్ విషయంలో పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాతే తాను ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పింది. ప్రస్తుతం నైనా జైసల్మేర్ లోని ఒక హోటల్ లో పని చేస్తోంది. ట్విట్టర్ లో ఆమె చేరిన సమయంలో ముంబైలో ఉంది.


More Telugu News