నాలుగు బుల్లెట్లు తగిలినట్టు ఇమ్రాన్ ఖాన్ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: పాక్ మంత్రి సనావుల్లా

  • ఇటీవల ఓ ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు
  • కాలికి గాయాలతో ఆసుపత్రిపాలైన ఇమ్రాన్
  • తనకు నాలుగు బుల్లెట్లు తగిలాయని వెల్లడి
  • ఇమ్రాన్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన హోంమంత్రి
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఇటీవల కాల్పులు జరగడం తెలిసిందే. కాలికి బుల్లెట్ గాయాలతో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రి నుంచే మీడియాతో మాట్లాడుతూ, తనకు నాలుగు బుల్లెట్లు తగిలాయని వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్ కాలికి కట్టుతోనే మీడియా సమావేశంలో పాల్గొన్నారు. 

అయితే, ఇమ్రాన్ ఖాన్ చెబుతున్న విషయాలు కట్టుకథలంటూ పాకిస్థాన్ హోం మంత్రి  రాణా సనావుల్లా కొట్టిపారేశారు. నాలుగు బుల్లెట్లు తగిలినట్టు ఇమ్రాన్ ఖాన్ నిరూపిస్తే, తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. ఇమ్రాన్ ఖాన్ కు అన్ని బుల్లెట్లు తగల్లేదని అన్నారు. 

అటు, ఇమ్రాన్ ఖాన్ పై కాల్పుల ఘటనలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనపై దాడికి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, హోంమంత్రి రాణా సనావుల్లా, సైన్యాధిపతి మేజర్ జనరల్ ఫైజల్ నజీర్ లే కారకులని ఇమ్రాన్ ఆరోపిస్తున్నారు. అయితే, ఈ ముగ్గురిలో ఏ ఒక్కరి పేరు ఎఫ్ఐఆర్ లో లేదు. నవీద్ అనే వ్యక్తి కాల్పులు జరిపినట్టు పంజాబ్ ప్రావిన్స్ పోలీసులు తమ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. 

దీనిపై రాణా సనావుల్లా స్పందిస్తూ, దేశంలో అరాచకం లేవదీయాలన్న ఉద్దేశంతోనే తమ ముగ్గురిపై ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. న్యాయవ్యవస్థను, సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగడం దేశ ప్రయోజనాలకు తగని విషయం అని స్పష్టం చేశారు. 

ఇమ్రాన్ పై దాడి ఘటన మతపరమైన కోణంలోనే జరిగుంటుందని తాను భావిస్తున్నానని, గతంలో ఇమ్రాన్ ఖాన్ బాధ్యతారాహిత్యంతో కూడిన అనేక వ్యాఖ్యలు చేయడమే అందుకు కారణం అయ్యుంటుందని మంత్రి సనావుల్లా తెలిపారు.

సైన్యం పైనా ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు చేస్తున్నారని, పాక్ లో సైన్యం ఒక క్రమశిక్షణ కలిగిన వ్యవస్థ అని స్పష్టం చేశారు. సైన్యం అధికారిక విధానం నుంచి ఎవరూ తప్పించుకోలేరని పేర్కొన్నారు. ఒకవేళ సైన్యం పరిధి నుంచి తప్పించుకోవాలని చూస్తే పర్యవసనాలు ఎదుర్కోకతప్పదని హెచ్చరించారు.


More Telugu News