మస్క్ చేతిలో ఐదు కంపెనీలు.. రోజులో 17 గంటల పని

  • వారంలో 120 గంటల పాటు పనిచేస్తున్న ఎలాన్ మస్క్
  • ట్విట్టర్ కొనడానికి ముందు వరకు 70-80 గంటలే
  • ఇప్పుడు ట్విట్టర్ చక్కదిద్దడానికే ఎక్కువ సమయం
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేతిలో ఇప్పుడు మొత్తం ఐదు కంపెనీలు ఉన్నాయి. వీటి కోసం ఆయన రోజులో 17 గంటల చొప్పున వారం మొత్తం మీద 120 గంటల వరకు కష్టపడుతున్నారు. 220 బిలియన్ డాలర్లకు పైగా సంపదతో ప్రపంచంలోనే నంబర్ 1 శ్రీమంతుడుగా ఉన్న మస్క్.. ఇటీవలే 44 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3.6 లక్షల కోట్లు) పెట్టి ట్విట్టర్ లో మెజారిటీ వాటాలు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాతోపాటు, శాటిలైట్లు, అంతరిక్ష వాహక నౌకలను తయారు చేసే స్పేస్ఎక్స్ కంపెనీకి ఎలాన్ మస్క్ యజమానిగా ఉన్నారు. ‘న్యూరా లింక్’ పేరుతో న్యూరో టెక్నాలజీ కంపెనీ సైతం ఆయనకు ఉంది. మెదడులో ఏర్పాటు చేయగల బ్రెయిన్ మెషిన్ ఇంటర్ ఫేసెస్ (బీఎంఐ) తయారు చేసే కంపెనీ ఇది. స్టార్టప్ స్థాయిలో ఉన్న చిన్న కంపెనీ. 

అలాగే, ద బోరింగ్ కంపెనీ కూడా ఉంది. ఇది నగరంలో ట్రాఫిక్ చిక్కులకు పరిష్కారంగా.. భూగర్భంలో టన్నెల్స్ మార్గంలో రహదారులను నిర్మించేందుకు ఏర్పాటైన కంపెనీ. ఈ కంపెనీ నుంచి సౌందర్య ఉత్పత్తులను కూడా మస్క్ ఆవిష్కరిస్తున్నారు. ఏ కంపెనీ అయినా మరొకరిని కాపీ కొట్టడం మస్క్ కు నచ్చదు. అపార ప్రతిభావంతుడిగా నిరూపించుకున్న మస్క్.. ప్రపంచానికి కొత్తదనాన్ని అందించేందుకు కృషి చేస్తుంటారు.


More Telugu News