ఆస్తి వివాదంలో అమానుషం.. కుటుంబ సభ్యులపై ట్రాక్టర్‌తో కంకరపోసి సజీవంగా పాతిపెట్టే యత్నం!

  • ఉమ్మడి ఆస్తిలో వాటా కోసం పోరాడుతున్న తల్లీ కుమార్తెలు 
  • ఉమ్మడిగా ఉన్న స్థలంలో నిందితుడు ఇల్లు కట్టే ప్రయత్నం చేస్తుండగా అడ్డుకున్న వైనం
  • ట్రాక్టర్ మట్టిని వారిపైనే పోసిన నిందితుడు
  • కంకరలో కూరుకుపోయిన వారిని రక్షించిన స్థానికులు
ఆస్తి వివాదంలో కుటుంబ సభ్యులనే సజీవంగా సమాధి చేసే ప్రయత్నం చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని హరిపురంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కుటుంబ ఉమ్మడి ఆస్తిలో తమకు న్యాయంగా రావాల్సిన వాటా ఇవ్వాలంటూ గ్రామానికి చెందిన కొట్ర దాలమ్మ, ఆమె కుమార్తె మజ్జి సావిత్రి 2019 నుంచి పోరాడుతున్నారు. 

మరోవైపు, స్థానిక హెచ్‌బీ కాలనీ సమీపంలో రహదారి పక్కన ఉమ్మడి ఆస్తిగా ఉన్న ఇంటి స్థలంలో నిర్మాణం కోసం దాలమ్మ భర్త నారాయణ అన్న కుమారుడు కొట్ర రామారావు ట్రాక్టరుతో కంకరమట్టి తోలిస్తున్నాడు. ఈ స్థలంలో తమకు కూడా వాటా ఉందని చెబుతూ దాలమ్మ, సావిత్రి అక్కడికి వెళ్లారు.

మట్టి ఎలా తోలుతారని రామారావుతో వాగ్వివాదానికి దిగారు. మట్టి పోయడానికి వీల్లేదంటూ ట్రాక్టర్ వెనకవైపున కూర్చున్నారు. అయినా పట్టించుకోని రామారావు వారిపైనే ట్రాక్టర్ మట్టిని పోయడంతో తల్లీకుమార్తెలు అందులో కూరుకుపోయారు. ఈ హఠాత్‌ పరిణామానికి విస్తుపోయిన వారు తమను కాపాడాలంటూ కేకలు వేశారు. గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని కంకర మట్టి తొలగించి వారిని రక్షించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న మందస పోలీసులు కొట్ర రామారావుపై కేసు నమోదు చేశారు.



More Telugu News