హిమాచల్ ప్రదేశ్‌లో మరో పాతికేళ్లు బీజేపీదే అధికారం: ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్

  • 1982 తర్వాత ఏ పార్టీకి రెండోసారి అధికారమివ్వని ప్రజలు
  • ఈసారి ప్రజలు చరిత్రను తిరగరాస్తారన్న ముఖ్యమంత్రి
  • రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఓటెయ్యాలని పిలుపు
హిమాచల్ ప్రదేశ్‌లో 1982 తర్వాత ఏ పార్టీ కూడా రెండోసారి అధికారం చేపట్టలేదు. దీంతో ఈసారి అక్కడి ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టేది తమకేనని కాంగ్రెస్ ఆశగా ఉంది. అయితే, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ మాత్రం అలాంటిదేమీ ఉండదని, ఈసారి మాత్రమే కాదని, మరో పాతికేళ్ల వరకు హిమాచల్ ప్రదేశ్‌‌ను తామే పాలిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బంజార్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీకి రెండోసారి అధికారం ఇవ్వని ప్రజలు ఈసారి ఆ చరిత్రను తిరగ రాస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంప్రదాయానికి భిన్నంగా ఈసారి ప్రజలు తమకే పట్టం కడతారని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ నాయకులు ఇలాగే అనుకున్నారని, కానీ అలా జరగలేదని ఆయన  గుర్తు చేశారు. తాము అధికారంలోకి వస్తే చాలా చేస్తామని కాంగ్రెస్ చెబుతోందని, పని చేతకాని వాళ్లే ఇలాంటి ప్రగల్భాలు పలుకుతారని సీఎం అన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పరిస్థితి మునిగిపోతున్న నావలా తయారైందని, అభివృద్ధిని చూసి ఓటేయాలని ప్రజలకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. కాగా, రాష్ట్రంలో మొత్తం 68 స్థానాలు ఉన్నాయి. శనివారం ఇక్కడ పోలింగ్ జరగనుంది.


More Telugu News