ఒకే జీఎస్టీ రేటు.. మినహాయింపులు లేని పన్ను వ్యవస్థ ఉండాలి: ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ వివేక్
- పన్నుల వాటా జీడీపీలో 15 శాతమేనన్న దేబ్రాయ్
- ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చు మాత్రం చాలా ఎక్కువగా ఉందని వెల్లడి
- ఉన్నత వర్గాల వస్తువుల పన్నుల్లో అంతరాల తొలగింపుతో సమస్యలకు పరిష్కారమన్న వివేక్
- ఇవన్నీ తన వ్యక్తిగత అభిప్రాయాలేనన్న ఆర్థిక వేత్త
దేశంలో అమలవుతున్న పన్నుల విధానం, జీఎస్టీ పన్నులపై ప్రధాన మంత్రికి ఆర్థిక సలహా మండలి చైర్మన్ గా పనిచేస్తున్న వివేక్ దేబ్రాయ్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ పన్ను రేటు ఏకరీతిగా ఉండాలన్న ఆయన... దేశీయ పన్నుల వ్యవస్థలో మినహాయింపులు ఉండరాదని వ్యాఖ్యానించారు. అయితే ఇవన్నీ తన వ్యక్తిగత అభిప్రాయాలని ఆయన పేర్కొనడం గమనార్హం.
కేంద్ర, రాష్ట్రాల పన్నుల వాటా జీడీపీలో కేవలం 15 శాతం మాత్రమేనని వివేక్ అన్నారు. అదే సమయంలో ప్రజా మౌలిక సదుపాయాలపై ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చు మాత్రం చాలా ఎక్కువగా ఉందన్నారు. ఉన్నత వర్గాలు వినియోగించే వస్తువులు, నిత్యావసరాలపై విధించే పన్నుల్లో ఉన్న అంతరాలను తొలగిస్తే... అనేక సంక్లిష్టతలకు ఇట్టే పరిష్కారం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. వస్తువుల ఉత్పత్తితో సంబంధం లేకుండా ఒకే రకమైన పన్నుల వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. జీఎస్టీ అమల్లోకి రాకముందు సగటు పన్ను రేటు 17 శాతం ఉండగా... జీఎస్టీ అమల్లోకి వచ్చాక సగటు పన్ను శాతం 11.5 శాతంగా ఉందని ఆయన అన్నారు.