అన్నీ రాజకీయపరంగానే ఉంటున్నాయి.. తెలుగు రాష్ట్రాల పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య

  • నారాయణ బెయిల్ రద్దు పిటిషన్ సందర్భంగా ఏపీ సర్కారుపై సుప్రీం ఆగ్రహం
  • తాజాగా తెలంగాణకు చెందిన పిటిషన్ పైనా అదే వ్యాఖ్య చేసిన కోర్టు
  • రాజకీయాల కోసం కోర్టులను వేదిక చేసుకోవద్దని హితవు
తెలుగు రాష్ట్రాల నుంచి దాఖలు అవుతున్న పిటిషన్ల తీరుపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ రెండు రాష్ట్రాల నుంచి దాఖలు అవుతున్న పిటిషన్లన్నీ దాదాపుగా రాజకీయపరంగానే ఉంటున్నాయని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. రాజకీయాల కోసం కోర్టులను వేదిక చేసుకోవద్దంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ముగ్గురు నిందితులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

ఇదిలా ఉంటే... అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పుపై టీడీపీ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణకు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగానూ కోర్టు ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు... మీ రాజకీయ ప్రతీకారంలో తమను భాగస్వాములను చేయవద్దంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.


More Telugu News