ఇమ్రాన్ ఖాన్ నటనా ప్రతిభ ముందు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ కూడా పనికిరారు: పీడీఎం నేత ఫజ్లుర్ రెహమాన్

  • ఇటీవల ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు
  • బుల్లెట్ గాయాలతో ఆసుపత్రిపాలైన పాక్ మాజీ ప్రధాని
  • సందేహాలు వ్యక్తం చేసిన పీడీఎం చీఫ్
  • ఇదొక డ్రామా అని విమర్శలు
  • ఇమ్రాన్ ఖాన్ ఒక దొంగ అని వ్యాఖ్యలు
ఇటీవల లాంగ్ మార్చ్ ర్యాలీ సందర్భంగా పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరగడం, ఆయన ఆసుపత్రి పాలవడం అంతా ఓ బూటకం అని పాకిస్థాన్ డెమొక్రటిక్ మూవ్ మెంట్ (పీడీఎం) నేత మౌలానా ఫజ్లుర్ రెహమాన్ ఘాటు విమర్శలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ తన నటనా నైపుణ్యాలతో బాలీవుడ్ స్టార్లు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లను మించిపోయాడని ఎద్దేవా చేశారు.

వజీరాబాద్ లో కాల్పుల ఘటన జరిగినప్పుడు మొదట ఇమ్రాన్ ఖాన్ పట్ల సానుభూతి వ్యక్తం చేశానని, కానీ జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత ఇదొక డ్రామా అని అర్థమైందని అన్నారు. ఇమ్రాన్ ఖాన్ కు తగిలిన గాయాలు పలు అనుమానాలు కలిగిస్తున్నాయని ఫజ్లుర్ రెహమాన్ అభిప్రాయపడ్డారు.

ఇమ్రాన్ ఖాన్ పై ఒక రౌండు కాల్చారా, పలు రౌండ్లు కాల్పులు జరిగాయా అనేది తెలియడంలేదని, అలాగే, ఒక కాలికే బుల్లెట్ గాయాలు తగిలాయా, లేక రెండు కాళ్లకు బుల్లెట్ గాయాలు తగిలాయా అనేది కూడా అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు. 

అంతేకాకుండా, ఇమ్రాన్ ఖాన్ ను వజీరాబాద్ లోని స్థానిక ఆసుపత్రికి తరలించకుండా, లాహోర్ ఆసుపత్రికి తీసుకెళ్లడం కూడా సందేహాలు కలిగిస్తోందని అన్నారు. బుల్లెట్ గాయాలకు క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స చేయడం ఏంటని ప్రశ్నించారు. 

పైగా, ఇమ్రాన్ ఖాన్ కు బుల్లెట్ ముక్కలు తగిలాయని పీటీఐ పార్టీ చెప్పడం విడ్డూరంగా ఉందని, అసలు బుల్లెట్ ఎలా ముక్కలవుతుందని ఫజ్లుర్ రెహమాన్ సందేహం వ్యక్తం చేశారు. ఎక్కడైనా బాంబు నుంచి శకలాలు వస్తాయని, బుల్లెట్ నుంచి ఎలా వస్తాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

కేవలం కళ్లు లేని కబోదులే ఇమ్రాన్ ఖాన్ చెప్పే అబద్ధాలు నమ్ముతారని వ్యంగ్యం ప్రదర్శించారు. అందరినీ దొంగలు అని పిలిచే ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు తానే దొంగ అయ్యాడని విమర్శించారు. ఈ ఎపిసోడ్ పై ఓ సంయుక్త దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని మౌలానా ఫజ్లుర్ రెహమాన్ డిమాండ్ చేశారు.


More Telugu News