రష్యా పర్యటనకు విదేశాంగ మంత్రి జైశంకర్

  • నేటి నుంచి రెండు రోజుల పాటు పర్యటన
  • రష్యా విదేశాంగ మంత్రి, ఉప ప్రధానితో భేటీలు
  • ద్వైపాక్షిక, ఆర్థిక అంశాలపై చర్చ
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ నేటి నుంచి రెండు రోజుల పాటు (7, 8వ తేదీల్లో) రష్యాలో పర్యటించనున్నారు. ముఖ్యంగా ఈ నెల 15, 16వ తేదీల్లో బాలిలో జీ-20 దేశాల భేటీ జరగనుండగా, దీనికి ముందు జైశంకర్ రష్యాలో పర్యటిస్తుండడం గమనార్హం. ఉక్రెయిన్ పై రష్యా దాడి మొదలైన తర్వాత పాశ్చాత్య దేశాలు పెద్ద ఎత్తున ఆంక్షలు విధించడం తెలిసిందే. పాశ్చాత్య దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకతను చూస్తున్న రష్యాతో, బంధానికి భారత్ ఎంతో ప్రాధాన్యం ఇస్తుండడం కీలకమైన అంశం కానుంది. 

రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తో జైశంకర్ భేటీ అవుతారు. ద్వైపాక్షిక అంశాలతోపాటు, ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలు వీరి మధ్య చర్చకు రానున్నాయి. రష్యా ఉప ప్రధాని, వాణిజ్య, పరిశ్రమల మంత్రి డెనిస్ మాంట్రోవ్ తోనూ జైశంకర్ సమావేశం కానున్నారు. రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై వీరు చర్చింనున్నారు. 

పాశ్చాత్య సమాజం మొత్తం రష్యాపై ఆంక్షలు పెట్టినన్పటికీ.. ఆ దేశం నుంచి భారత్ పెద్ద మొత్తంలో చమురు, గ్యాస్ దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. తద్వారా దశాబ్దాలుగా విశ్వసనీయ మిత్ర దేశంగా ఉన్న రష్యాకు భారత్ పరోక్ష మద్దతునిస్తుండడం గమనార్హం. తాజా పర్యటనతో ఈ బంధం మరింత బలపడనుంది. దీనిపై అమెరికా, యూరప్ దేశాలు ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది.


More Telugu News