పాకిస్థాన్ పోలీసధికారి ఖాతాలో రూ. పది కోట్లు జమ.. ఏటీఎం కార్డు బ్లాక్ చేసిన బ్యాంక్

  • జీతంతో పాటు పెద్ద మొత్తం ఖాతాలో చూసి షాక్ అయిన అధికారి
  • ఇది వరకు ముగ్గురు పోలీసుల ఖాతాల్లోనూ ఇలానే పెద్ద మొత్తం జమ
  • విచారణ చేపట్టిన అధికారులు
ఆయన ఓ పోలీసు ఉద్యోగి. నెల జీతంతో జీవితం నెట్టుకొస్తున్నాడు. ఆయన బ్యాంక్ ఖాతాలో ఎన్నడూ కనీసం లక్ష రూపాయలు కూడా లేవు. అలాంటి వ్యక్తి ఖాతాలో ఉన్నట్లుండి రూ. 10 కోట్లు జమ అయ్యాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు.

అయితే, గుర్తు తెలియని మూలం నుంచి పెద్ద మొత్తం జమ అవడంతో బ్యాంక్ ఆయన ఖాతాను స్తంభింపజేసింది. ఏటీఎం కార్డులు కూడా బ్లాక్ చేసింది. ఈ సంఘటన పాకిస్థాన్ లోని కరాచీ నగరంలో జరిగింది. కరాచీలోని బహదూరాబాద్ పోలీస్ స్టేషన్‌ దర్యాప్తు అధికారి అమీర్ గోపాంక్ కి జీతంతో పాటు బ్యాంక్ ఖాతాలో పది కోట్ల రూపాయలు జమ అయ్యాయి. విషయం తెలిసి ఆయన షాక్ అయ్యారు. 

‘నా జీవితంలో ఇంత డబ్బు చూడలేదు. ఎందుకంటే నా ఖాతాలో ఎప్పుడూ కొన్ని వేల రూపాయల కంటే ఎక్కువ లేదు. బ్యాంక్ సిబ్బంది ఫోన్ చేసి చెప్పే వరకు నాకు ఈ విషయం తెలియదు’ అని అమీర్ వెల్లడించారు. అయితే, ఇంత పెద్ద మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని దర్యాప్తు చేస్తున్నందున తన ఖాతాను బ్యాంక్ ఫ్రీజ్ చేసిందని,  ఏటీఎం కార్డును కూడా బ్లాక్ చేసిందని ఆయన చెప్పారు. 

ఇది వరకు లర్కానా, సుక్కూర్‌లలో కూడా కొందరు పోలీసు ఉద్యోగుల ఖాతాల్లో ఇలానే పెద్ద మొత్తంలో నగదు జమ అయింది. లర్కానాలో ముగ్గురు పోలీసు అధికారులు ఒక్కొక్కరు తమ ఖాతాల్లో ఐదు కోట్ల రూపాయలు ఉన్నట్లు గుర్తించారు. సుక్కూర్‌లో ఓ పోలీసు అధికారి బ్యాంక్ ఖాతాలోనూ ఇలానే భారీ మొత్తం జమ అయింది. సదరు సిబ్బంది తమ ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో డబ్బు ఎలా వచ్చిందనే విషయం గురించి తమకు తెలియదంటున్నారు. ఈ విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు.


More Telugu News