అయ్యన్న పాత్రుడికి మద్దతుగా 125 కార్లతో ర్యాలీ

  • తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నుంచి తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు
  • ఏదో ఒక సాకుతో అయ్యన్నపై కేసులు పెడుతూనే ఉన్నారన్న గోరంట్ల
  • అయ్యన్నను కలిసి సంఘీభావం తెలిపిన అశోక్ గజపతి రాజు
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు నిన్న రాజమహేంద్రవరం నుంచి అనకాపల్లి మీదుగా నర్సీపట్నానికి ర్యాలీగా వచ్చి అయ్యన్నపాత్రుడికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. ఏదో ఒక సాకుతో అయ్యన్నపై కేసులు పెడుతూనే ఉన్నారని అన్నారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారంటూ అయ్యన్న కుమారుడు విజయ్ ఇంటికి వెళ్లి ఆయన కుమార్తెను వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాదయాత్ర అంటూ మూడేళ్లు రోడ్లపై తిరిగిన నిన్ను ఏనాడైనా అడ్డగించామా? అని జగన్‌ను ప్రశ్నించారు. జగన్ పాలనలో టీడీపీ నాయకుల్లో ఏ ఒక్కరికి నష్టం జరిగినా తాడేపల్లి ప్యాలెస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అయ్యన్నను అరెస్ట్ చేసేందుకు రాత్రిపూట ఎందుకొచ్చారని, పగటి పూట ఏం చేస్తున్నారని సీఐడీ అధికారులను గోరంట్ల ప్రశ్నించారు. అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ.. జిల్లాలు దాటి వందలమంది వచ్చి తన సంఘీభావం తెలపడం ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. ఇక ఆగేదే లేదని, దూసుకుపోతానని పేర్కొన్నారు.

కాగా, నర్సీపట్నం వచ్చిన కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు నిన్న అయ్యన్నను కలిసి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకులను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని చూడడం సరికాదని జగన్‌కు హితవు పలికారు. వైసీపీ పాలనలో అభివృద్ధి, సంక్షేమం లేవని విమర్శించారు. విజయనగరం నుంచి నర్సీపట్నం వరకు రోడ్లు గతుకులతో అధ్వానంగా ఉన్నాయన్నారు. ఈ మూడున్నరేళ్లలో జగన్ సాధించింది ఏదైనా ఉందీ అంటే ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లి సంతకం పెట్టకుండా ఉండడమేనని అశోక్ ‌గజపతిరాజు ఎద్దేవా చేశారు.


More Telugu News