పుతిన్ నోట హిరోషిమా, నాగసాకి అణు విస్ఫోటనాల మాట

  • ఉక్రెయిన్ పై కొనసాగుతున్న రష్యా దాడులు
  • తరచుగా అణుయుద్ధం గురించి మాట్లాడుతున్న పుతిన్
  • ఫ్రాన్స్ దేశాధినేతతో సంభాషణలోనూ అణు ప్రస్తావన
  • ఆందోళనకు గురవుతున్న పాశ్చాత్య దేశాల అధినేతలు
రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా జపాన్ నగరాలు హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణుబాంబులు వేయడం తెలిసిందే. 1945 ఆగస్టు 6న హిరోషిమా పైనా, ఆగస్టు 9న నాగసాకిపైనా రెండు అణుబాంబులు ప్రయోగించింది. ఈ అణ్వస్త్ర ప్రయోగంతో జపాన్ లొంగిపోగా, రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. ఈ రెండు నగరాల్లో ఊహకందని నష్టం వాటిల్లింది. 

ఇక, అసలు విషయానికొస్తే... ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తరచుగా అణుయుద్ధం గురించి మాట్లాడుతున్నారు. తద్వారా ఆయన అగ్రరాజ్యం అమెరికా, పాశ్చాత్య దేశాలకు హెచ్చరికలు చేస్తున్నట్టే భావించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

తాజాగా పుతిన్ ఫ్రాన్స్ దేశాధినేత ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ తో మాట్లాడుతూ, హిరోషిమా, నాగసాకి అణు విస్ఫోటనాల గురించి ప్రస్తావించారు. యుద్ధంలో గెలవాలంటే ఇలా ప్రధాన నగరాలపైనే దాడి చేయనక్కర్లేదు అంటూ ఎక్కడైనా అణుబాంబు వేయొచ్చన్న రీతిలో పరోక్ష వ్యాఖ్యలు చేశారు. 

అయితే పుతిన్ మరోసారి అణుయుద్ధం గురించి మాట్లాడడం పాశ్చాత్యదేశాల అధినేతలను కలవరపాటుకు గురిచేస్తోంది. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడానికి పుతిన్ వ్యూహాత్మక అణ్వాయుధాన్ని ఉపయోగించే అవకాశాలు ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

కాగా, యూరప్ లో శీతాకాలం వస్తే  మంచు పరిస్థితుల కారణంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరికొంతకాలం కొనసాగే అవకాశాలున్నాయి. వీలైనంత త్వరగా ఈ యుద్ధానికి ముగింపు పలకాని పుతిన్ భావిస్తే అణ్వస్త్ర ప్రయోగానికి దిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


More Telugu News