జింబాబ్వేపై టీమిండియా భారీ విజయం... సెమీస్ లో ఇంగ్లండ్ తో అమీతుమీ

  • 71 పరుగుల తేడాతో నెగ్గిన భారత్
  • 187 పరుగుల ఛేదనలో జింబాబ్వే 115 ఆలౌట్
  • అశ్విన్ కు 3 వికెట్లు
  • రెండేసి వికెట్లు సాధించిన షమీ, పాండ్యా
  • ఈ నెల 10న టీమిండియా, ఇంగ్లండ్ సెమీఫైనల్
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్ ప్రత్యర్థిని ఖరారు చేసుకుంది. నేడు సూపర్-12 దశ గ్రూప్-2లో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో భారత్ 71 పరుగుల తేడాతో జింబాబ్వేపై ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో గ్రూప్ టాపర్ గా నిలిచిన టీమిండియా...  గ్రూప్-2లో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ తో సెమీస్ లో తలపడనుంది. ఈ మ్యాచ్ నవంబరు 10న అడిలైడ్ లో జరగనుంది

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేయగా... 187 పరుగుల లక్ష్యఛేదనలో జింబాబ్వే 17.2 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో ర్యాన్ బర్ల్ 35, సికిందర్ రజా 34 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. 

టీమిండియా బౌలర్లలో అశ్విన్ 3, షమీ 2, పాండ్యా 2, భువనేశ్వర్ కుమార్ 1, అర్షదీప్ సింగ్ 1, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. 

కాగా, ఈ విజయంతో భారత్ గ్రూప్-2లో 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. సూపర్-12 దశలో మొత్తం 5 మ్యాచ్ లు ఆడిన రోహిత్ సేన 4 మ్యాచ్ లు గెలిచి, ఒక్క సౌతాఫ్రికా చేతిలో ఓడింది. 

కాగా, నవంబరు 9న జరిగే తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. భారత్, పాకిస్థాన్ జట్లు సెమీఫైనల్లో పోటీల్లో నెగ్గితే, ఫైనల్ మ్యాచ్ ద్వారా మరోసారి మహాసంగ్రామం ఆవిష్కృతం కానుంది. సూపర్-12 దశలో దాయాదుల మధ్య జరిగిన మ్యాచ్ ఎంత రసవత్తరంగా జరిగిందో తెలిసిందే. ఈ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నవంబరు 13న మెల్బోర్న్ మైదానంలో జరగనుంది.


More Telugu News