నవంబరు 8న చంద్రగ్రహణం... తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

  • 11 గంటల పాటు ఆలయం మూసివేత
  • ఉదయం 8.40 నుంచి రాత్రి 7.20 వరకు మూసివేత
  • సంప్రోక్షణ, ప్రదోష కాలపు పూజల అనంతరం దర్శనాలకు అనుమతి
ఇటీవలే పాక్షిక సూర్యగ్రహణం కారణంగా మూతపడిన తిరుమల శ్రీవారి ఆలయం మరోసారి మూతపడనుంది. నవంబరు 8న చంద్ర గ్రహణం సంభవించనుండడంతో, తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని 11 గంటల పాటు మూసివేయనున్నారు. ఉదయం 8.40 గంటల నుంచి రాత్రి 7.20 గంటల వరకు ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. 

కాగా, చంద్ర గ్రహణం మధ్యాహ్నం 2.39 గంటల నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు కొనసాగనుంది. గ్రహణం ముగిసిన అనంతరం సంప్రోక్షణ, ప్రదోష కాలపు పూజలు నిర్వహించి ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. వైకుంఠం-2 క్యూ కాంప్లెక్స్ ద్వారా భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. 

చంద్ర గ్రహణం నేపథ్యంలో నవంబరు 7న సిఫారసు లేఖలు స్వీకరించబోవడంలేదని టీటీడీ పేర్కొంది. నవంబరు 8న గ్రహణం రోజున తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేయనున్నారు. బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసింది.


More Telugu News