విజయోత్సవ ర్యాలీ కోసం అనుమతి కోరిన కేఏ పాల్!

  • మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ పడ్డ కేఏ పాల్
  • ప్రచారంలో తానే గెలుస్తానని చెప్పిన వైనం
  • ఏడు రౌండ్లలో పాల్ కు వచ్చింది 322 ఓట్లే
మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతుండగా.. ఈ ఎన్నికల్లో పోటీ పడ్డ కేఏ పాల్ కౌంటింగ్ రోజు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. పోటాపోటీగా తలపడుతున్న టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ప్రభాకర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి టెన్షన్ లో ఉండగా.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తన విజయోత్సవ ర్యాలీకి అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరినట్టు తెలుస్తోంది. పాల్ అభ్యర్థనను పోలీసులు తిరస్కరించినట్టు సమాచారం. 

కాగా, ఏడు రౌండ్లు పూర్తయ్యే సరికి పాల్ మొత్తంగా 322 ఓట్లు మాత్రమే సాధించారు. ఏడో రౌండ్ లో ఆయనకు 31 ఓట్లు లభించాయి. ఈ లెక్కన పాల్ వెయ్యి ఓట్లు సాధిస్తే గొప్పే అనిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తానే గెలుస్తానని పాల్ చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీ కోసం ఆయన ముందుగానే అనుమతి కోరినట్టు తెలుస్తోంది. ఏదేమైనా తన ప్రచారం, హావభావాలు, చర్యలతో కేఏ పాల్.. ఉత్కంఠగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో అందరినీ నవ్విస్తున్నారు.


More Telugu News