టీ20 ప్రపంచకప్ లో థర్డ్ అంపైర్ మరో తప్పిదం.. బంగ్లా కెప్టెన్ షకీబ్ షాక్​

  • బంగ్లా కెప్టెన్ షకీబ్ ఔట్ నిర్ణయం వివాదాస్పదం
  • బంతి ముందుగా బ్యాట్ ను తాకినా ఎల్బీ ఇచ్చిన థర్డ్ అంపైర్
  • అసహనం వ్యక్తం చేసిన షకీబ్
టీ20 ప్రపంచ కప్‌ లో అంపైర్ల తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఫీల్డ్ అంపైర్లతో పాటు థర్డ్ అంపైర్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. తాజాగా పాకిస్థాన్–బంగ్లాదేశ్ మ్యాచ్ లో థర్డ్ అంపైర్ నిర్ణయం చర్చనీయాంశమైంది. బంగ్లా ఇన్నింగ్స్ 11వ ఓవర్లో ఆ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఔట్ విషయంలో థర్డ్ అంపైర్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. స్పిన్నర్ షాదాబ్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో మొదట సౌమ్యా సర్కార్ ఔట్ అవగా తర్వాతి బంతికే షకీబ్ ఎల్బీ డబ్ల్యూ కోసం పాకిస్థాన్ అప్పీల్ చేసిన వెంటనే ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. దీనికి షకీబ్ డీఆర్ ఎస్ కోరాడు. 

రివ్యూలో బంతికి ముందుగా బ్యాట్ ను తగిలినట్టు అల్ట్రా ఎడ్జ్ లో చాలా స్పష్టంగా స్పైక్ కనిపించింది. ఆ తర్వాతే బంతి షకీబ్ ప్యాడ్లను తాకింది. కానీ, ఇన్ సైడ్ ఎడ్జ్ క్లియర్ గా ఉన్నప్పటికీ థర్డ్ అంపైర్ ఎల్బీ డబ్ల్యూ ఇచ్చాడు. బ్యాట్ నేలను తాకడం వల్లే అల్ట్రా ఎడ్జ్ లో స్పైక్ వచ్చినట్టు పేర్కొన్నాడు. కానీ, స్పైక్ వచ్చిన సమయంలో బ్యాట్ కు, నేలకు మధ్య ఖాళీ టీవీ రీప్లేల్లో కనిపించింది. అయినప్పటికీ థర్డ్ అంపైర్ ఎల్బీ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే బంగ్లా కెప్టెన్ షకీబ్ షాకయ్యాడు. దీనిపై ఫీల్డ్ అంపైర్లతో మాట్లాడాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశాడు. అంతకుమించి చేసేదేమీ లేక మైదానం వీడాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్ తడబడింది. దాంతో, బంగ్లా తక్కువ స్కోరుకే పరిమితం అయింది.


More Telugu News