అన్ని ఫార్మాట్లలోనూ కోహ్లీనే చాంపియన్: ప్రశంసలు కురిపించిన రికీ పాంటింగ్

  • ఆసియాకప్‌తో ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ
  • పాకిస్థాన్‌పై కోహ్లీ ఇన్నింగ్స్‌ను ముందే ఊహించానన్న పాంటింగ్
  • తాను చూసిన అత్యుత్తమమైన నాక్‌లలో అదొకటన్న పాంటింగ్
ఇటీవల ఫామ్‌తో చెలరేగిపోతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఫామ్ కోల్పోయి మూడేళ్లపాటు పరుగులు చేయలేక తంటాలు పడి, ఇంటాబయట విమర్శలు ఎదుర్కొన్న కోహ్లీ ఆసియా కప్‌‌తో తిరిగి ఫామ్ సంతరించుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో పరుగులతో అలరిస్తున్నాడు. రికీ పాంటింగ్ తాజాగా మాట్లాడుతూ.. కోహ్లీని ఆకాశానికెత్తేశాడు. కోహ్లీ మూడు ఫార్మాట్లలోనూ చాంపియన్ ప్లేయర్‌గా ఉన్నాడని కొనియాడాడు. 

ఈ టోర్నమెంటులో ఒక్క వారం వెనక్కి వెళ్తే కనుక ఎంసీజీలో జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో తాను ఊహించినదే జరిగిందని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. విరాట్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కావడం తాను ఊహించినదేనని అన్నాడు. తాను చూసిన వాటిలో ఆ నాక్ అత్యుత్తమమైన వాటిలో ఒకటని అన్నాడు. మూడో స్థానంలో కోహ్లీ సౌకర్యవంతంగా ఉన్నాడని, అతడిని అలాగే ఉండనివ్వాలని కోరాడు. కోహ్లీ ఉండడం ద్వారా జట్టు లాభపడుతోందన్నాడు. ప్రపంచకప్‌లో ఇండియా కనుక తర్వాతి దశకు చేరుకుంటే కోహ్లీ మరోమారు అద్భుతం చేయడం పక్కా అని పాంటింగ్ అన్నాడు. 

ఆసియా కప్‌లో భాగంగా ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయ సెంచరీ (122) సాధించిన కోహ్లీ 1,021 రోజుల తర్వాత తన సెంచరీ దాహాన్ని తీర్చుకున్నాడు. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. ఇప్పటి వరకు నాలుగు మ్యాచుల్లో మూడు అర్ధ సెంచరీలతో 220 పరుగులు చేసి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.


More Telugu News