గుజరాత్ ఎన్నికల నుంచి తప్పుకుంటే వారిపై కేసులు ఎత్తేస్తామని ఆఫర్ ఇచ్చింది: బీజేపీపై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

  • ‘ఆప్’ను విడిచిపెడితే సిసోడియాను సీఎంను చేస్తామన్నారన్న కేజ్రీవాల్
  • ఆయన తిరస్కరించడంతో బీజేపీ నేరుగా తననే సంప్రదించిందన్న ఆప్ చీఫ్
  • గుజరాత్‌లో గెలిచేది తామేనని ధీమా
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. గుజరాత్ ఎన్నికల నుంచి తప్పుకుంటే తమ నేతలు మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లపై విచారణ నిలిపివేస్తామని బీజేపీ నుంచి ఆఫర్ వచ్చినట్టు చెప్పారు. ‘ఆప్’ను విడిచిపెడితే ఢిల్లీ ముఖ్యమంత్రిని చేస్తామన్న బీజేపీ ప్రతిపాదనను మనీశ్ సిసోడియా తిరస్కరించడంతో వారిప్పుడు తననే నేరుగా సంప్రదించారని అన్నారు. ‘ఎన్‌డీటీవీ టౌన్‌హాల్’ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. 

ఈ ఆఫర్ ఎవరి నుంచి వచ్చిందన్న ప్రశ్నకు బదులిస్తూ.. అది వారి (బీజేపీ) నుంచే వచ్చిందని, ఇలాంటి విషయాల్లో బీజేపీ నేరుగా సంప్రదించదని, ఒకరి నుంచి మరికొరికి వస్తూ చివరికి తనకు చేరిందని అన్నారు. గుజరాత్ అసెంబ్లీ, ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో ఓటమి పాలవుతామని బీజేపీ భయపడుతోందని, తమ పార్టీని అడ్డుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోందని అన్నారు. 

మనీశ్ సిసోడియా, సత్యేంద్రజైన్‌లపై నమోదైన రెండూ తప్పుడు కేసులేనని కేజ్రీవాల్ అన్నారు. గుజరాత్ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామేనని ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్‌లో కాంగ్రెస్‌కు ఐదు కంటే తక్కువ సీట్లే వస్తాయన్నారు. అక్కడ బీజేపీ-కాంగ్రెస్ ఒకదానికొకటి సహకరించుకుంటున్నాయని కేజ్రీవాల్ ఆరోపించారు. గుజరాత్‌లో ప్రస్తుతం తాము రెండో స్థానంలో ఉన్నామని, ఎన్నికల తర్వాత మొదటి స్థానానికి చేరుకుంటామని కేజ్రీవాల్ పేర్కొన్నారు.


More Telugu News