చెరువులో మునిగి ఐదుగురు విద్యార్థుల మృతి...  కాపాడబోయిన ఉపాధ్యాయుడు కూడా మృతి

  • మేడ్చల్ జిల్లాలో విషాద ఘటన
  • సరదాగా ఈత కొట్టేందుకు చెరువులో దిగిన విద్యార్థులు
  • లోతుకు వెళ్లి మునిగిపోయిన వైనం
  • ఉపాధ్యాయుడ్ని అప్రమత్తం చేసిన ఇతర విద్యార్థులు
  • ఈత రాక ఉపాధ్యాయుడు సైతం మునక 
మేడ్చల్ జిల్లా మల్కారం వద్ద తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఎర్రకుంట చెరువులో మునిగిపోయి ఆరుగురు మృత్యువాత పడ్డారు. వారిలో ఐదుగురు విద్యార్థులు కాగా, మరొకరు ఉపాధ్యాయుడు. 

మరణించిన విద్యార్థులు 14 ఏళ్ల లోపు వారు. వీరంతా అంబర్ పేటలోని ఓ మదరసాకు చెందిన విద్యార్థులు. తమ ఉపాధ్యాయుడి బంధువు ఇంట ఫంక్షన్ లో పాల్గొనేందుకు మల్కారం వచ్చారు. స్థానికంగా చెరువు ఉండడంతో ఈత కొట్టేందుకు ఆసక్తి చూపించారు. అయితే నీటిలో దిగిన కాసేపటికే విద్యార్థులు మునిగిపోయారు. 

ఒడ్డున ఉన్న ఇతర విద్యార్థులు ఇది గమనించి తమ ఉపాధ్యాయుడిని అప్రమత్తం చేశారు. అయితే మునిగిపోతున్న విద్యార్థులను కాపాడేందుకు చెరువులో దిగి ఉపాధ్యాయుడు కూడా మృతి చెందాడు. విద్యార్థులు చెరువు మధ్యలోకి వెళ్లడంతో అక్కడ లోతు ఎక్కువగా ఉన్నందున ఈత కొట్టలేక మునిగిపోయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.


More Telugu News