ఇప్పటంలో రోడ్డు విస్తరణ చేయమని ఎవరడిగారు? మీకు చేతనైతే రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చండి: తెనాలి శ్రావణ్ కుమార్

  • ఇప్పటంలో కూల్చివేతలపై భగ్గుమంటున్న టీడీపీ నేతలు
  • జనసేన సభకు భూములిచ్చారన్న కక్షతోనే కూల్చివేశారన్న శ్రావణ్ 
  • విస్తరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చటం ఏంటి? అంటూ ప్రశ్న 
రాష్ట్రంలోని రోడ్లపై ఉన్న గుంతల్ని పూడ్చలేని వైసీపీ ప్రభుత్వం రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటంలో ఇళ్లు కూల్చడం దుర్మార్గమని టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మండిపడ్డారు. శనివారం నాడు టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఇప్పటంలో 120 అడుగులు రోడ్దు విస్తరణ చేయమని ఎవరడిగారు? అంటూ నిలదీశారు. జనసేన సభకు భూములిచ్చారన్న కక్షతోనే ఒక సామాజికవర్గం వారి ఇళ్లు కూల్చారని ఆరోపించారు. 

"మీకు చేతనైనే రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చండి. రాష్ట్రంలో రోడ్ల దుస్థితి ముఖ్యమంత్రికి తెలియదా? గుంతల్లో పడి వైసీపీ కార్పోరేటర్ చనిపోయింది వాస్తవం కాదా?" అని ప్రశ్నించారు. రాజధాని అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డు విస్తరణ పనులు జరగకుండా కోర్టుకెళ్లిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మారుమూల గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చటం ఏంటి? అని శ్రావణ్ కుమార్ నిలదీశారు. 

నువ్వు ప్రజలకు మొహం చాటేయటం తప్ప నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏంటి? అంటూ మండిపడ్డారు. దాడులు చేయటం, రాళ్లు వేయించటం రాజశేఖర్ రెడ్డి కుటుంబ పేటెంట్ హక్కు అని వ్యంగ్యంగా అన్నారు.  

"నందిగామలో చంద్రబాబు నాయుడుపై జరిగిన రాళ్ల దాడి ఘటనలో పూలలో రాళ్లు ఉన్నాయని నిందితుల్ని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రాళ్లు వేసినవారు స్ధానిక వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అనుచరులు. వారి ఫొటోలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశాం. కానీ  పోలీసులు మాత్రం పక్కదారి పట్టిస్తున్నారు. 

చంద్రబాబు నాయుడి విశాఖ పర్యటనలో కోడి గుడ్లతో దాడికి ప్రయత్నించారు. దాడులు, దౌర్జన్యాలు పులివెందుల సంసృతి...  నచ్చని వాళ్ల మీద దాడులు, దౌర్జన్యం చేయటం వైసీపీకి దినచర్యగా మారింది. 

వైసీపీ నేతలు బూతులు తిట్టడం తప్ప విధానపరమైన అంశాలు మాట్లాడలేరు. వైసీపీ అరాచక పాలనకు కాలం చెల్లింది, బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు" అని తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు.


More Telugu News