మనవరాలికి జన్మనిచ్చిన నాయనమ్మ... సరోగసీలో కొత్త కోణం!

  • ఐదో బిడ్డను కనాలనుకున్న వ్యక్తి
  • భార్య గర్భసంచి తొలగించడంతో సరోగసీ వైపు మొగ్గు
  • ముందుకొచ్చిన వ్యక్తి తల్లి
  • కొడుకు బిడ్డను నవమాసాలు మోసిన వైనం
ఇటీవల కాలంలో సరోగసీ విధానంలో సంతానాన్ని పొందుతున్న ధోరణి పెరుగుతోంది. ఈ విధానంలో పిల్లలు కావాలనుకున్న వారు అద్దెగర్భం ద్వారా తమ కోరిక నెరవేర్చుకుంటారు. ఫలదీకరణం చెందిన అండాలను మరో మహిళ గర్భంలో ప్రవేశపెట్టి, ఆమె ద్వారా సంతానం పొందుతారు. అందుకోసం చాలామంది దంపతులు బయటి మహిళలను సంప్రదిస్తుంటారు. 

అయితే అమెరికాలో సరోగసీ విధానంలో కొత్త కోణం వెలుగుచూసింది. 56 ఏళ్ల మహిళ తన కొడుకు-కోడలు బిడ్డను 9 నెలలు గర్భంలో మోసి జన్మనిచ్చింది. వివరాల్లోకెళితే... అమెరికాలోని ఉటా ప్రాంతానికి చెందిన జెఫ్ హాక్, కేంబ్రియా భార్యాభర్తలు. జెఫ్ హాక్ ఓ వెబ్ డెవలపర్. 

జెఫ్-కేంబ్రియా దంపతులకు అప్పటికే నలుగురు పిల్లలు ఉన్నారు. కాగా, కొన్ని సమస్యల వల్ల కేంబ్రియాకు గర్భసంచిని వైద్యులు తొలగించారు. దాంతో మరో బిడ్డను కనాలన్న ఆ దంపతులు సరోగసీ వైపు మొగ్గుచూపారు. అందుకు జెఫ్ హాక్ తల్లి నాన్సీ హాక్ ముందుకు రావడం విశేషం. 

నాన్సీ హాక్ వయసు 56 సంవత్సరాలు. ఆమె ఉటా టెక్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. మరో బిడ్డ కోసం ప్రయత్నిస్తున్న కొడుకు, కోడలు కోసం నాన్సీ నడివయసులో రిస్కు తీసుకున్నారు. విజయవంతంగా గర్భాన్ని మోసిన ఆమె ఇటీవల అమ్మాయికి జన్మనిచ్చింది. 

దీనిపై నాన్సీ కుమారుడు జెఫ్ హాక్ స్పందిస్తూ, ఇవి అందమైన క్షణాలు అని పేర్కొన్నారు. ఇటువంటి అపురూప క్షణాలు ఎంతమందికి అనుభవంలోకి వస్తాయి? అని సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ఆ పాపకు హన్నా అని నామకరణం చేశారు. కాగా, ఆ బిడ్డ తన కడుపులో ఉన్నప్పుడే కచ్చితంగా అమ్మాయే పుడుతుంది అని నాన్సీ హాక్ గట్టిగా చెప్పిందట.


More Telugu News