కాస్త కష్టంగా లంకపై గెలిచి సెమీస్ చేరిన ఇంగ్లండ్... ఆసీస్ ఆశలు గల్లంతు

  • టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ వర్సెస్ లంక
  • 4 వికెట్ల తేడాతో నెగ్గిన ఇంగ్లండ్
  • 142 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో ఛేదించిన వైనం
  • ఓ దశలో వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్
  • ఒత్తిడి పెంచిన లంక స్పిన్నర్లు
  • కీలక ఇన్నింగ్స్ ఆడిన బెన్ స్టోక్స్
టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ జట్టు సెమీఫైనల్లో ప్రవేశించింది. ఇవాళ శ్రీలంకతో జరిగిన లీగ్ మ్యాచ్ లో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో కాస్త కష్టంగా గెలిచింది. 142 పరుగుల విజయలక్ష్యాన్ని 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ 42 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 

ఛేదనలో 75 పరుగుల వరకు ఒక్క వికెట్టు కూడా కోల్పోని ఇంగ్లండ్ అక్కడ్నించి వరుసగా వికెట్లు చేజార్చుకుంది. లంక స్పిన్నర్లు ధనంజయ డిసిల్వ, వనిందు హసరంగ, పేసర్ లహిరు కుమార రెండేసి వికెట్లు తీసి ఇంగ్లండ్ పై ఒత్తిడి పెంచారు. అయితే బెన్ స్టోక్స్ చివరి వరకు క్రీజులో నిలిచి ఇంగ్లండ్ ను గెలుపుతీరాలకు చేర్చాడు. 

అంతకుముందు ఓపెనర్లు అలెక్స్ హేల్స్ 47, జోస్ బట్లర్ 28 పరుగులు చేసి శుభారంభం అందించారు. వీరి ఊపు చూస్తే ఇంగ్లండ్ సునాయాసంగా గెలుస్తుందనిపించింది. అయితే మిడిల్ ఓవర్లలో లంక బౌలర్లు విజృంభించడంతో ఇంగ్లండ్ శిబిరంలో ఆందోళన నెలకొంది. కానీ టార్గెట్ చిన్నదే కావడంతో ఇంగ్లండ్ ఊపిరిపీల్చుకుంది. 

కాగా ఈ విజయంతో ఇంగ్లండ్ సెమీస్ బెర్తు ఖాయం చేసుకోగా, ఆతిథ్య ఆస్ట్రేలియాకు తీవ్ర నిరాశ తప్పలేదు. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ ఓడిపోయుంటే ఆసీస్ కు సెమీస్ చాన్స్ దక్కేది. గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్ ఇప్పటికే సెమీస్ చేరగా, రెండో జట్టుగా ఇంగ్లండ్ సెమీస్ చాన్సు చేజిక్కించుకుంది.


More Telugu News