భారత్ అద్భుతమైన ఫలితాలను సాధిస్తుంది: పుతిన్ ప్రశంసలు

  • భారత్ ను అభివృద్ధి దిశగా తీసుకెళ్లే నైపుణ్యం భారతీయులకు ఉందన్న పుతిన్
  • 150 కోట్ల మందితో భారత్ సమర్థవంతంగా ఉందని ప్రశంస
  • ఇటీవలే మోదీపై కూడా ప్రశంసలు కురిపించిన పుతిన్
భారత్ పై, భారతీయులపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. 'భారత్ ను చూడండి. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను అభివృద్ధి దిశగా తీసుకెళ్లే నైపుణ్యం భారతీయులకు ఉంది. అభివృద్ధిలో భారత్ కచ్చితంగా అద్భుతమైన ఫలితాలను సాధిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. 150 కోట్ల మంది ప్రజలతో భారత్ సమర్థవంతంగా ఉంది' అని కొనియాడారు. రష్యా ఐక్యతా దినోత్సవం సందర్భంగా మాస్కోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

గత వారం కూడా ప్రధాని మోదీపై పుతిన్ ప్రశంసల జల్లు కురిపించారు. మోదీ గొప్ప దేశ భక్తుడని కితాబునిచ్చారు. మోదీ స్వతంత్ర విదేశాంగ విధానంతో భారత్ ఎంతో సాధించిందని చెప్పారు. భవిష్యత్తు భారత్ దే అని వ్యాఖ్యానించారు. వచ్చే వారం భారత విదేశాంగ మంత్రి జైశంకర్ రష్యాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పుతిన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తో జైశంకర్ ద్వైపాక్షిక భేటీలో పాల్గొననున్నారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారంపై వీరు చర్చించనున్నారు.


More Telugu News