చౌకగా అద్దె ఇల్లు వస్తుంటే.. అంత పెట్టి ఇల్లు కొనడం ఎందుకు?: 'జెరోదా' కామత్

  • నివాస గృహాలపై అద్దె రాబడి 3 శాతమేనన్న నిఖిల్ కామత్
  • ద్రవ్యోల్బణాన్ని అందుకోలేనంత దూరంలో ఉందని వెల్లడి
  • అలాంటప్పుడు అంత ధర పెట్టి కొనడం ఎందుకంటూ ప్రశ్న
ప్రముఖ స్టాక్ బ్రోకరేజీ సంస్థ జెరోదా వ్యవస్థాపకుల్లో ఒకరైన నిఖిల్ కామత్ ఓ కీలకమైన అంశాన్ని చర్చకు తీసుకొచ్చారు. భారీ మొత్తం పెట్టి ముంబైలో ఫ్లాట్ కొనుక్కోవడం ఎందుకు? అన్నది ఆయన ప్రశ్న. దీనికి బదులు చౌకగా అద్దె చెల్లించి అదే ఫ్లాట్ లో ఉంటే పోదూ..! అని నిఖిల్ కామత్ పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా ఇటీవలే ఆయన ‘సొంత ఇల్లు - అద్దె ఇల్లు’ అంశంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

‘‘వడ్డీ రేట్లు పెరిగిపోతున్నాయి. దీంతో ఈఎంఐలు కూడా పెరుగుతాయి. వృద్ధ జనాభా పెరుగుతోంది. చాలా రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉంది. వృద్ధులకు తక్కువ స్థలం చాలు. నివాస గృహాలపై అద్దె రాబడి 3 శాతమే. ఇది ద్రవ్యోల్బణాన్ని అందుకోలేనంత దూరంలో ఉంది. 

భారత్ లో నల్లధనం సమస్య పరిష్కారమైనప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎక్కువ ప్రభావితం అవుతుంది. రియల్ ఎస్టేట్ ను కావాలనుకున్నప్పుడు వెంటనే విక్రయించలేం. ముంబైలో 1000 చదరపు అడుగుల అపార్ట్ మెంట్ ధర అంత అధికంగా ఎందుకు ఉంది? కేవలం 3 శాతం అద్దె ఇచ్చి ఉండే దానికి బదులు నీవు ఎందుకు కొనుగోలు చేయాలి?’’ అంటూ నిఖిల్ కామత్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. తద్వారా దీనిపై ఆలోచించేలా చేశారు. 

ఇల్లు ఆర్థికంగా, భావోద్వేగపరంగా భద్రతను ఇస్తుందేమో కానీ, పెట్టుబడులపై రాబడులు గతంలో మాదిరి రిటైర్మెంట్ జీవితానికి సరిపోవడం లేదంటూ జెరోదా సహ వ్యవస్థాకుల్లో మరొకరు అయిన నితిన్ కామత్ పేర్కొన్నారు. అద్దె రాబడి ద్రవ్యోల్బణం కంటే ఎక్కువైనా ఉండాలి. లేదంటే ప్రాపర్టీ ధరలు ప్రతి ఏడేళ్లకు రెట్టింపు కావాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


More Telugu News