జ్ఞానవాపి మసీదు కేసు.. శివలింగానికి ‘కార్బన్ డేటింగ్’ పిటిషన్‌‌ను స్వీకరించిన అలహాబాద్ హైకోర్టు

  • శివలింగాన్ని భద్రపరచమని సుప్రీంకోర్టు చెప్పిందన్న వారణాసి జిల్లా కోర్టు
  • కార్బన్ డేటింగ్ పరీక్షకు అనుమతి ఇవ్వలేమని స్పష్టీకరణ
  • జిల్లా కోర్టు తీర్పును హైకోర్టులో సవాలు చేసిన మహిళా భక్తులు
వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో లభ్యమైన శివలింగానికి కార్బన్ డేటింగ్ నిర్వహించాలన్న పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. మసీదులోని వాజుఖానాలో లభించిన ఈ శివలింగానికి కార్బన్ డేటింగ్‌ నిర్వహించాలన్న పిటిషన్‌ను వారణాసి జిల్లా కోర్టు తిరస్కరించింది. దీంతో ఈ తీర్పును సవాలు చేస్తూ లక్ష్మీదేవితోపాటు మరో ముగ్గురు మహిళా భక్తులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిని స్వీకరించిన హైకోర్టు మసీదును నిర్వహిస్తున్న అంజుమన్ ఇంతెజామియా కమిటీకి నోటీసులు జారీ చేసింది. 

గత నెల 14న వారణాసి జిల్లా కోర్టు తీర్పు చెబుతూ.. శివలింగాన్ని భద్రపరచమని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, కాబట్టి దాని వయసు, స్వరూపం నిర్ధారించే కార్బన్ డేటింగ్ పరీక్షకు అనుమతులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. మరోవైపు, మసీదులోని శృంగార గౌరి, ఇతర హిందూ దేవతల విగ్రహాలను పూజించుకునేందుకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హత ఉందంటూ వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మసీదు కమిటీ వేసిన అప్పీలుపై విచారణను అలహాబాద్ హైకోర్టు ఈ నెల 22కు వాయిదా వేసింది.


More Telugu News