ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో స్టే ఎత్తివేయండి... హైకోర్టులో తెలంగాణ సర్కారు పిటిషన్

  • ఈ కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతోందని ప్రభుత్వం వెల్లడి
  • కేసు నమోదైన వెంటనే దర్యాప్తు ఏకపక్షమని బీజేపీ చెప్పడం బాధాకరమని వ్యాఖ్య
  • పంచనామాను ప్రాధాన్యంగా తీసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడి
టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి తెలంగాణ సర్కారు హైకోర్టులో శుక్రవారం ఓ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు దర్యాప్తుపై విధించిన స్టేను ఎత్తివేయాలని ప్రభుత్వం తన పిటిషన్ లో హైకోర్టును కోరింది. ఈ సందర్భంగా కేసులో చోటుచేసుకున్న పలు కీలక పరిణామాలను తెలంగాణ సర్కారు తన పిటిషన్ లో పేర్కొంది. కేసు దర్యాప్తులో జాప్యం చోటుచేసుకుంటే... సాక్ష్యాలు తారుమారు అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతోందని ప్రభుత్వం తెలిపింది. కేసు నమోదై 24 గంటలు కూడా గడవకముందే దర్యాప్తు ఏకపక్షంగా జరుగుతోందని బీజేపీ ఆరోపించడం బాధాకరమని తెలిపింది. నిరాధార ఆరోపణలతోనే బీజేపీ పిటిషన్ వేసిందని పేర్కొంది. పంచనామాలో మధ్యవర్తుల సంతకం దగ్గర తేదీలు రాయడంలో పొరపాటు జరిగిందని వివరించింది. పిటిషన్ పై విచారణలో పంచనామాను ప్రాధాన్యంగా తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది.


More Telugu News