బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో కోహ్లీ చేసింది తప్పేనంటున్న భారత మాజీ క్రికెటర్

  • కోహ్లీపై ఫేక్ ఫీల్డింగ్ ఆరోపణలు
  • తమకు 5 రన్స్ ఇచ్చి ఉండాల్సిందంటున్న బంగ్లా ఆటగాళ్లు
  • బంగ్లాదేశ్ వాదనలో నిజం ఉందన్న ఆకాశ్ చోప్రా
  • కోహ్లీ 100 శాతం ఫేక్ ఫీల్డింగ్ చేశాడని వ్యాఖ్య  
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఫామ్ లోకి వచ్చాడని అభిమానులు సంతోషిస్తుండగా, ఓ అనూహ్య వివాదం అతడిని చుట్టుముట్టింది. టీ20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ కు పాల్పడ్డాడని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

అక్షర్ పటేల్ బౌలింగ్ లో బంగ్లా ఆటగాడు శాంతో షాట్ కొట్టగా, ఫీల్డర్ అర్షదీప్ ఆ బంతిని అందుకుని కీపర్ కార్తీక్ వైపు విసిరాడు. అయితే, కోహ్లీ తన చేతిలో బంతి లేకపోయినా నాన్ స్ట్రయికర్ వైపు బంతిని విసురుతున్నట్టు నటించాడు. దీనిపై బంగ్లా ఆటగాళ్లు మండిపడ్డారు. 

కోహ్లీ తమ బ్యాట్స్ మెన్ దృష్టి మళ్లించడానికి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించాడని బంగ్లాదేశ్ ఆటగాడు నూరుల్ హసన్ ఆరోపించాడు. కోహ్లీకి జరిమానాగా బంగ్లాదేశ్ జట్టుకు ఐదు పరుగులు ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. 

ఈ వివాదంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో కోహ్లీ చేసింది తప్పేనని అన్నాడు. కోహ్లీ తీరు చూస్తే ఇది 100 శాతం ఫేక్ ఫీల్డింగ్ అనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ చర్యను అంపైర్లు గమనించి ఉంటే మనకు 5 పరుగుల జరిమానా విధించేవాళ్లని అన్నాడు. బంగ్లాదేశ్ వాదనలో అర్థం ఉందని పేర్కొన్నాడు. 

కాగా, భారత క్రికెట్ అభిమానులు మాత్రం బంగ్లాదేశ్ వాదనలను కొట్టిపారేస్తున్నారు. కోహ్లీ ఫీల్డింగ్ చేసేటప్పుడు ఎంతో సరదాగా ఉంటాడని, ఇది కూడా అందులో భాగంగా చేసిందేనని అంటున్నారు. ఓటమికి బంగ్లాదేశ్ కుంటిసాకులు చెబుతోందని, ఆ జట్టుకు ఇది అలవాటేనని భారత అభిమానులు ఎద్దేవా చేశారు.


More Telugu News