అప్పుడు చంద్రబాబు చేసిందే.. ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నారు: కిషన్ రెడ్డి విమర్శలు

  • ప్రభుత్వాన్ని స్వామీజీలు కూల్చగలరా? అని కిషన్ రెడ్డి ప్రశ్న
  • రోహిత్ రెడ్డి నీతిమంతుడైనట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా
  • ఎమ్మెల్యేలను కొనాల్సిన కర్మ బీజేపీకి లేదని వ్యాఖ్య
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించారనే అంశం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇదే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో బీజేపీపై నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ... కేసీఆర్ చూపించిన వీడియోలో ఆయన ప్రభుత్వాన్ని కూల్చే విధంగా ఎక్కడా లేదని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అంత బలహీనంగా ఉందా? అని ప్రశ్నించారు. స్వామీజీలు ప్రభుత్వాలను కూల్చేంత సీన్ ఉంటుందా? అని అడిగారు.

ఆ నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు ఏ పార్టీ నుంచి గెలిచారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పక్క పార్టీల్లో గెలిచిన వారిని లాక్కున్న మీరా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది? అని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పెద్ద నీతిమంతుడైనట్టు చెపుతున్నారని దుయ్యబట్టారు. ఎప్పుడూ చెప్పే విషయాలనే కేసీఆర్ మళ్లీ చెప్పారని ఎద్దేవా చేశారు. తనలోని ఆక్రోశాన్ని, అభద్రతాభావాన్ని మరోసారి వెళ్లగక్కారని అన్నారు. తనకి తానే తన సీఎం పదవిని చులకన చేసేలా కేసీఆర్ మాట్లాడారని చెప్పారు. బ్రోకర్ల ద్వారా ఇతర పార్టీల నేతలను చేర్చుకునే అవకాశం మీకు ఉందేమో కానీ... బీజేపీకి లేదని అన్నారు. 

తన తర్వాత తన కుమారుడు కేటీఆర్ ముఖ్యమంత్రి కాలేడేమో అనే భయంతో కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని... గిమ్మిక్కులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలను కొనాల్సిన కర్మ బీజేపీకి లేదని చెప్పారు. గతంలో ప్రత్యేకహోదా పేరుతో బీజేపీపై చంద్రబాబు ఎలా బురద చల్లే ప్రయత్నం చేశారో... ఇప్పుడు కేసీఆర్ కూడా అదే చేస్తున్నారని... బీజేపీని ఓడించేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు.


More Telugu News