ఓటీటీలోకి వచ్చేసిన బ్రహ్మాస్త్ర, పీఎస్1.. ఎక్కడ చూడొచ్చంటే!

  • డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న బ్రహ్మాస్త్ర
  • అమెజాన్ ప్రైమ్ లో ఈ రోజు విడుదలైన పీఎస్1
  • ఈ ఏడాది ఘన విజయం సాధించిన రెండు చిత్రాలు
ఓటీటీ ప్రేక్షకుల కోసం రెండు పెద్ద సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. చాన్నాళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ విజయంతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఊరట నిచ్చిన ‘బ్రహ్మస్త్ర’ ఓటీటీలో రిలీజైంది. అలాగే, దక్షిణాదితో పాటు విదేశీ ప్రేక్షకులను మెప్పించిన మరో హిట్ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్1 (పీఎస్1) కూడా బుల్లితెర ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ రెండు భారీ చిత్రాలు ఈ రోజు నుంచి స్ట్రీమ్ అవుతున్నాయి. ‘బ్రహ్మాస్త్ర’ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. ‘పీఎస్1’ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీవ్ అవుతోంది. 

రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ బాలీవుడ్ లో ఈ మధ్య భారీ విజయం సాధించిన చిత్రంగా నిలిచింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్ ఇండియా చిత్రం సెప్టెంబరు 9న విడుదలైంది.  బ్రహ్మస్త్ర ( మొదటి భాగం - శివ) చిత్రాన్ని దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. అన్ని భాషల్లో కలిపి రూ.450 కోట్లకిపైగా రాబట్టింది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున, డింపుల్ కపాడియా, మౌని రాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.   

దిగ్గజ దర్శకుడు మణిరత్నం రూపొందించిన పీఎస్1 కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ, తెలుగుతో పాటు హిందీలోనూ ఈ చిత్రానికి మంచి వసూళ్లు లభించాయి. రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం.. మొదటి భాగంతోనే ఆ మొత్తం రాబట్టింది. విక్రమ్‌, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్‌, విక్రమ్‌ ప్రభు, శోభిత ధూళిపాళ, జయరామ్‌, ప్రభు, పార్తిబన్‌, ప్రకాష్‌రాజ్‌ వంటి అగ్ర నటీనటులు ఈ చిత్రంలో నటించారు.  తమిళంలో ఆల్ టైం హిట్ గా నిలిచిన ‘విక్రమ్’ రికార్డులను ఈ చిత్రం అధిగమించింది.


More Telugu News