ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిపిన దుండగుడిని పట్టుకున్న వ్యక్తిపై ప్రశంసల జల్లు

  • పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ పై నిన్న వజీరాబాద్ లో కాల్పులు
  • ఓ రౌండ్ కాల్పులు జరపగానే అతడిని కొట్టి పట్టుకున్న ఇబ్తిసామ్ అనే అభిమాని
  • తాను బ్రతికుండగా ఇమ్రాన్ కు ఏమీ కాదంటున్న ఇబ్తిసామ్
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై హత్యాయత్నం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గురువారం వజీరాబాద్‌లో  ర్యాలీ సందర్భంగా ఇమ్రాన్ లక్ష్యంగా చేసుకొని దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ కాలుకు బుల్లెట్ గాయం అయింది. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్న ఇమ్రాన్ కు ప్రాణాపాయం తప్పింది. కాగా, ఇమ్రాన్ పై కాల్పులు జరిపిన దుండగుడిని సంఘటన స్థలంలో పట్టుకున్న ఇబ్తిసామ్ హసన్ అనే వ్యక్తిపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు అతడిని అభినందించారు. ఆ వ్యక్తిని తమ భుజాలపై ఎత్తుకొని ఊరేగించారు.

‘ఇమ్రాన్ పై కాల్పులు జరిపిన వెంటనే మరో రౌండ్ కాల్చేముందు నేను ఆ దుండగుడిని కొట్టాను. దాంతో, తుపాకీ కింద పడిపోయింది. వెంటనే అతను పారిపోయే ప్రయత్నం చేశాడు. నేను వెంబడించి పట్టుకున్నా. నేను బ్రతికున్నంతకాలం ఇమ్రాన్ ఖాన్ కు ఏమీ జరగదు’ అని ఇబ్తిసామ్ చెప్పాడు. 

ఇక, ఇమ్రాన్ ఖాన్‌పై దాడిని ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఖండించారు. ఈ ఘటనపై పాక్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, పంజాబ్ చీఫ్ సెక్రటరీ నుంచి నివేదిక కోరవలసిందిగా అంతర్గత మంత్రి రాణా సనావుల్లాను ఆదేశించారు. కాగా, పాకిస్థాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్ అక్టోబర్ 29న లాహోర్ నుంచి ఇస్లామాబాద్ వరకు సుదీర్ఘ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ శుక్రవారం ఇస్లామాబాద్ చేరుకోవాల్సి ఉండగా.. ఇంతలోనే ఆయనపై కాల్పులు జరిగాయి.


More Telugu News