ఏపీ రాజధాని అమరావతిపై రేపు సుప్రీంకోర్టులో విచారణ
- అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఏపీ హైకోర్టు తీర్పు
- హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం
- ఈ నెల 1న నాట్ బిఫోర్ మీ అంటూ విచారణ నుంచి తప్పుకున్న సీజేఐ
- జస్టిస్ జోసెఫ్, జస్టిస్ రుషికేష్ రాయ్ ల బెంచ్ ముందు విచారణ జరిగే అవకాశం
ఏపీ రాజధాని అమరావతిపై దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో రేపు (శుక్రవారం) విచారణ జరగనుంది. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై జరిగే విచారణలో తమనూ ఇంప్లీడ్ చేసుకోవాలంటూ అమరావతి రైతుల జేఏసీ దాఖలు చేసిన పిటిషన్ ను కూడా సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. అంతేకాకుండా పలువురు వ్యక్తులు కూడా ఈ వ్యవహారంలో ఇంప్లీడ్ పిటిషన్లను దాఖలు చేశారు. వీటన్నింటిపైనా రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
ఈ నెల 1ననే ఈ పిటిషన్లపై విచారణ జరగాల్సి ఉండగా... సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్... 'నాట్ బిఫోర్ మీ' అంశాన్ని లేవనెత్తి ఈ పిటిషన్ల విచారణ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. తాను సభ్యుడిగా లేని మరో బెంచ్ కు ఈ పిటిషన్ల విచారణను అప్పగించాలని ఆయన కోర్టు రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ రుషికేష్ రాయ్ లతో కూడిన సుప్రీం ధర్మాసనానికి ఈ వ్యవహారాన్ని రిజిస్ట్రీ బదిలీ చేసినట్లు సమాచారం. ఈ బెంచ్ లోనే అమరావతిపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.