తెలంగాణ తర్వాత వెంటనే ఆంధ్రలో ప్రభుత్వాన్ని కూలగొడతామని చెప్పారు: సీఎం కేసీఆర్

  • కేసీఆర్ ప్రెస్ మీట్
  • బీజేపీ నేతలపై నిప్పులు చెరిగిన సీఎం
  • తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని వెల్లడి
  • అవి ఆషామాషీ ఆధారాలు కావని వ్యాఖ్యలు
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించడంపై తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, అవి ఆషామాషీ ఆధారాలు కాదని అన్నారు. ఈ తంతు చాలా రోజులుగా జరుగుతోందని తెలిపారు. తన ప్రభుత్వాన్ని కూలగొడతామని చెబుతుంటే ఊరుకుని మౌనంగా ఉండాలా? అని ప్రశ్నించారు.

"గత నెలలో ఇక్కడకు రామచంద్రభారతి అనే ఒకాయన వచ్చాడు. అనేక ప్రయత్నాలు చేసి మా తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని కలిశాడు. వారు ఏం ప్లాన్ చేయాలనుకుంటున్నారో అర్థమయ్యాక రోహిత్ రెడ్డి ఆ విషయం మాకు చెప్పాడు. దాంతో మేం హోంమంత్రికి ఫిర్యాదు చేశాం. దీనిపై సమగ్ర విచారణ జరగాలని కోరుకున్నాం. 

ఆ వీడియో చాలా పెద్దది... మూడు గంటల నిడివితో ఉంది. కోర్టుల సౌకర్యం కోసం ఆ వీడియోని కుదించడం జరిగింది. ఆ వీడియోలో వాళ్లు ప్రస్తావించిన పేర్లు దేశంలోని పెద్ద నేతలవి. ఇప్పటికే మేం 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టాం, ఇంకో 4 రాష్ట్రాల్లో కూలగొడుతున్నాం అని చెప్పారు. 

తెలంగాణలో కూలగొడతాం, ఆ తర్వాత ఢిల్లీ వంతు... ఢిల్లీలో ఇప్పటికే బేరాలు అయిపోయాయి... ఆ తర్వాత ఆంధ్రలో వెంటనే కూలగొడతాం, అది ముగిశాక మా టార్గెట్ రాజస్థాన్... అక్కడ కూడా కూలగొడతాం. ఇప్పటికే రాజస్థాన్ లో 21 మంది ఎమ్మెల్యేలు వచ్చేశారు... అంటూ ఆ వీడియోలోని వ్యక్తులు చెబుతున్నారు. 

ఏంటిది... దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? ఇతర రాష్ట్రాల్లోని వారు దీన్ని మౌనంగా భరించారేమో కానీ, ఇది తెలంగాణ... మా శాసనసభ్యులు వీరోచితంగా దీన్ని బయటపెట్టారు. ఈ రాక్షసుల కుట్రను బద్దలు కొట్టాలని భావించి పార్టీకి, ప్రభుత్వానికి సమాచారం అందించారు. ఆ ముఠాను ఇక్కడ పట్టుకున్నాం కాబట్టి, ఈ వ్యవహారమంతా బయటికి వచ్చింది. ఇది నిన్న మొన్నా జరిగింది కాదు... అనేక రోజులుగా జరుగుతోంది. 

మా స్కానర్ లో ఉన్నారంటే మీకు వై కేటగిరీ భద్రత, ఇన్ కమ్ ట్యాక్స్ నుంచి రక్షణ.. అన్నీ మేమే చూసుకుంటాం అని వాళ్లు చెబుతున్నారు... ఆ చెప్పే వ్యక్తి ఎవరు మంత్రా, లేక ప్రధానమంత్రా? ఇన్ కమ్ ట్యాక్స్ ను మేమే చూసుకుంటాం, ఈడీని మేమే చూసుకుంటాం అని ఇంత నిర్భయంగా ఈ రాజ్యాంగేతర శక్తులు మాట్లాడుతున్నాయి. ఈ వీడియోలో చూస్తే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. 

ఈ ముఠా చిన్నది కాదు, 24 మంది ఉన్నాం అని వాళ్లు చెప్పడం మీరు చూస్తారు. ఒక్కొక్కరికి మూడు ఆధార్ కార్డులు, మూడేసి పాన్ కార్డులు, మూడేసి డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయి. వీళ్లలో కేరళలో రాహుల్ గాంధీపై పోటీ చేసిన తుషార్ అనే బీజేపీ నేత కూడా ఉన్నాడు. నాడు తుషార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది అమిత్ షానే. ఈ కుట్రలో వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. వీళ్లకు ఇన్నేసి ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఎలా వస్తున్నాయి? 

ఈ వీడియోలను అన్ని రాష్ట్రాల డీజీపీలకు కూడా పంపిస్తున్నాము. ఈ ముఠాలో స్వామీజీలు కూడా ఉన్నారు. ప్రభుత్వాలను కూలగొట్టడమే వాళ్ల పని. మధ్యప్రదేశ్ లో కూలగొట్టాం, కర్ణాటకలో కూలగొట్టాం అని, కర్ణాటకలో ఎమ్మెల్యేలకు కూలీల వేషం వేసి ఎలా ట్రాక్టర్లలో తీసుకెళ్లారో కూడా వాళ్లు చెప్పడాన్ని ఈ వీడియోలో చూస్తారు. దేశంలో ఏమైనా చేయగలమన్న దురహంకారంతో మాట్లాడారు.  

ఇవన్నీ నేను న్యాయమూర్తులకు కూడా పంపించాను. దేశంలో ఇంకెవరూ మౌనంగా ఉండరాని పరిస్థితి ఇది. ఈ విశృంఖల వ్యవస్థను అరికట్టకపోతే దేశంలో అందరికీ ప్రమాదకరమే" అని పేర్కొన్నారు. 

ఈ వీడియోకు సంబంధించిన పెన్ డ్రైవ్ లను మీడియా ప్రతినిధులందరికీ ఇస్తామని కేసీఆర్ వెల్లడించారు. ఈ ఫుటేజి దేశం అంతా పంపిస్తున్నామని, ఇది ప్రపంచానికి అంతటికీ తెలియాలని పేర్కొన్నారు. అనంతరం ఆ వీడియోలను మీడియా ప్రతినిధులకు ప్రదర్శించారు.


More Telugu News