ఇప్పుడో వీడియో చూపిస్తాం... ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది: సీఎం కేసీఆర్

  • ముగిసిన మునుగోడు ఉప ఎన్నిక
  • సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్
  • ఇవాళ చాలా బాధతో మాట్లాడుతున్నానని వెల్లడి
  • అందరికీ తెలియాలనే వీడియో విడుదల చేస్తున్నామని వివరణ
దేశంలో ప్రజాస్వామ్య హత్య నిర్లజ్జగా, దుర్మార్గంగా కొనసాగుతోందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన నేపథ్యంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. 45 ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్నానని, ఇవాళ ఎంతో బాధతో మాట్లాడుతున్నానని వివరించారు. 

కొందరు ఇలా కూడా ప్రవర్తిస్తారా అనే విధంగా వ్యవహరించారని, దానికి సంబంధించిన ఫుటేజి అందరికీ చూపిస్తామని తెలిపారు. బీజేపీ దేశాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేసిందని, ఇది అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. 

కొన్ని అంశాలను తాము వెల్లడించాలని భావించినప్పటికీ, మునుగోడు ఉప ఎన్నిక ఉండడంతో, దానివల్ల లబ్దిపొందుతామన్న ఆరోపణలు వస్తాయని మౌనంగా ఉండిపోయామని తెలిపారు. పోలింగ్ ముగిసిన తర్వాతే ప్రజలకు వెల్లడించాలని ఇప్పటిదాకా ఎదురుచూశామని వివరించారు. 

తాము చూపించనున్న వీడియో ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని, తమను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమా వారిలో కనిపించడం దిగ్భ్రాంతి కలిగించే విషయం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ ఈ ఘాతుకాన్ని తెలుసుకోవాలని అన్నారు. దేశంలోని అన్ని మీడియా సంస్థలకు ఈ వీడియో పంపించామని, అన్ని రాష్ట్రాల సీఎంలకు, పార్టీల అధ్యక్షులకు, హైకోర్టు చీఫ్ జస్టిస్ లకు కూడా వీడియో పంపిస్తామని చెప్పారు. 

బీజేపీ జుగుప్సాకర రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ప్రధాని బెంగాల్ వెళ్లి దీదీ మీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని చెబుతారు. ఇదేం సంస్కృతి? అమిత్ షా ఇక్కడికొచ్చి నెలరోజుల్లో తెలంగాణ సర్కారు కూలిపోతుందని చెబుతారు. మరీ ఇంత దారుణమా? అంటూ కేసీఆర్ వివరించారు.


More Telugu News