మునుగోడులో ముగిసిన పోలింగ్.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు

  • సాయంత్రం 6 గంటలకు ముగిసిన పోలింగ్
  • ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం
  • సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్
  • 2018 ఎన్నికల్లో మునుగోడులో 91.3 శాతం పోలింగ్ నమోదు
  • ఈ రికార్డును చెరిపేస్తుందా? లేదా? అన్న విశ్లేషణలో పార్టీలు
తెలంగాణ వ్యాప్తంగా అమితాసక్తి రేకెత్తించిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో గురువారం సాయంత్రం 6 గంటలకు కీలక ఘట్టం పూర్తయింది. మునుగోడు ఎన్నికలో పోలింగ్ ముగిసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే పోలింగ్ ముగిసే సమయానికి నియోజకవర్గ వ్యాప్తంగా చాలా పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరి నిలబడ్డారు. ఈ క్రమంలో నిబంధనల మేరకు పోలింగ్ గడువు ముగిసే సమయానికి వరుసలో నిలిచిన వారందరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టనున్నట్లు ఈసీ వెల్లడించింది.

కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ద్వారా దక్కిన ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగగా... ఆయన రాజీనామా చేసిన కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి, అధికార టీఆర్ఎస్ నుంచి 2018 ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి చేతిలో ఓడిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలోకి దిగారు. ఈ 3 ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీగా సాగిన ఎన్నికలో పోలింగ్ కూడా భారీగానే నమోదైంది.

గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ తొలుత కాస్తంత మందకొడిగా సాగినా... ఆ తర్వాత ఊపందుకుంది. సాయంత్రం పోలింగ్ గడువు ముగియడానికి ఓ గంట ముందు (సాయంత్రం 5 గంటల వరకు) 77.55 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. చివరి గంటలో మరింత జోరుగా పోలింగ్ సాగడం, గడువు ముగిసే సమయానికి కూడా పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరి ఉండటంతో ఈ పోలింగ్ శాతం 85 శాతం మేర నమోదయ్యే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2018 ఎన్నికల్లో మునుగోడులో 91.3 శాతం మేర పోలింగ్ నమోదు కాగా... ఇప్పుడు ఆ మేర పోలింగ్ నమోదవుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


More Telugu News