కీలక మ్యాచ్ లో చేతులెత్తేసిన దక్షిణాఫ్రికా... పాకిస్థాన్ విజయంతో సెమీస్ ఆశలు సజీవం

  • సిడ్నీలో వరల్డ్ కప్ మ్యాచ్
  • వర్షం అడ్డంకి.. డీఎల్ఎస్ వర్తింపజేసిన అంపైర్లు
  • దక్షిణాఫ్రికా లక్ష్యం 14 ఓవర్లలో 142 రన్స్
  • 108 పరుగులు చేసిన ఓటమిపాలైన సఫారీలు
వరుణుడు ప్రభావం చూపించిన మ్యాచ్ లో పాకిస్థాన్ విజయం సాధించింది. వరల్డ్ కప్ చరిత్రలో వరుణుడి చేతిలో చిత్తవడాన్ని ఆనవాయతీగా మార్చుకున్న దక్షిణాఫ్రికా మరోసారి వర్షం బారినపడింది. లక్ష్యాన్ని కుదించిన ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు 33 పరుగుల తేడాతో సఫారీలను ఓడించింది. 

వర్షం అనంతరం దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 14 ఓవర్లలో 142 పరుగులకు కుదించగా, ఆ జట్టు 9 వికెట్లు కోల్పోయి కేవలం 108 పరుగులు చేసింది. ఈ విజయంతో పాక్ సెమీస్ ఆశలు సజీవంగా నిలుపుకుంది. పాక్ ఇక సెమీస్ చేరాలంటే ఆదివారం జరిగే మ్యాచ్ లో భారత్... జింబాబ్వే చేతిలో ఓడిపోవాల్సి ఉంటుంది. అదే సమయంలో తన చివరి లీగ్ మ్యాచ్ లో పాక్... బంగ్లాదేశ్ పై గెలవాల్సి ఉంటుంది. 

అంతకుముందు, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 185 పరుగులు చేసింది. వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయే సమయానికి 9 ఓవర్లలో 4 వికెట్లకు 69 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా... కొత్త టార్గెట్ నేపథ్యంలో 30 బంతుల్లో 73 పరుగులు చేయాల్సి వచ్చింది. అయితే ఆ జట్టు లక్ష్యానికి 33 పరుగుల దూరంలో నిలిచిపోయింది. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది 3 వికెట్లు తీయగా, షాదాబ్ ఖాన్ 2, నసీమ్ షా 1, హరీస్ రవూఫ్ 1, మహ్మద్ వాసిం జూనియర్ 1 వికెట్ తీశారు.


More Telugu News