సముద్రం నేపథ్యంలో సాగే మరో ప్రేమకథ .. 'జెట్టి'!

  • సముద్రం నేపథ్యంలో సాగే 'జెట్టి'
  • జాలరుల జీవితాలకు అద్దం పట్టే కథ 
  • ప్రతినాయకుడిగా కనిపించనున్న మైమ్ గోపి 
  • ఈ నెల 4వ తేదీన సినిమా విడుదల 
సముద్రం నేపథ్యం .. జాలరుల జీవన విధానానికి అద్దం పడుతూ గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. జాలరుల జీవితాలతో ముడిపడిన ప్రేమకథగా ఇటీవల వచ్చిన 'ఉప్పెన' కూడా సంచలన విజయాన్ని సాధించింది. అలా సముద్రాన్ని నమ్ముకున్న జీవితాల చుట్టూ తిరిగే కథగా ప్రేక్షకులను పలకరించడానికి 'జెట్టి' సినిమా సిద్ధమవుతోంది. 

మన్యం కృష్ణ - నందిత శ్వేత జంటగా నటించిన ఈ సినిమాలో, ప్రతినాయకుడి పాత్రను మైమ్ గోపి పోషించాడు. వేణుమాధవ్ నిర్మించిన ఈ సినిమాకి సుబ్రమణ్యం పిచుక దర్శకత్వం వహించాడు. కార్తీక్ కొడకండ్ల సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, ఈ నెల 4వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 

హీరో హీరోయిన్ మధ్య ప్రేమ .. జాలరుల జీవితాలపై పెద్దల పెత్తనం .. అణచివేతను సహించలేని ఒక యువకుడు తిరగబడటం ఈ ట్రైలర్ లో ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో సిద్ శ్రీరామ్ పాడిన 'దూరం కరిగినా' పాట పాప్యులర్ అయింది. గ్రామీణ నేపథ్యంతో కూడిన కథాకథనాలతో వస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి.


More Telugu News