ఘజియాబాద్ లో దొంగల ‘న్యూస్ పేపర్’ ట్రిక్

  • ఇంటి ఆవరణలో న్యూస్ పేపర్ విడిచి పెట్టిన దొంగలు
  • ఆ పేపర్ వేసిన చోటే ఉండిపోవడంతో ఎవరూ లేరని నిర్ధారణ
  • ఇంట్లోకి చొరబడి విలువైన ఆభరణాలన్నీ చోరీ
దొంగలు ఎంతో తెలివితేటలను ప్రదర్శిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో జరిగిన ఓ చోరీ వ్యవహారం దీన్ని రుజువు చేస్తోంది. ఓ కుటుంబం వైష్ణో దేవీ యాత్ర కోసం అక్టోబర్ 29న వెళ్లి బుధవారం తిరిగొచ్చింది. చూసేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. ఐరన్ మెష్ డోర్ కూడా కొంత తెరిచి ఉంది. ఇంట్లో ఉన్న రూ.10 లక్షలు విలువ చేసే ఆభరణాలు కనిపించలేదు. కప్ బోర్డ్ లో పెట్టిన సూట్స్ కూడా లేవు. 

ఇంటి ఆవరణలో ఓ న్యూస్ పేపర్ పడి ఉండడాన్ని యజమానులు గుర్తించారు. అక్టోబర్ 29వ తేదీతో అది ఉంది. అంటే ఇంట్లోని వారు యాత్రకు వెళ్లిన రోజే దొంగలు ఆ ఇంటిని పరిశీలించినట్టు తెలుస్తోంది. న్యూస్ పేపర్ విడిచిపెట్టి, దాన్ని తీసుకున్నదీ, లేనిదీ మరుసటి రోజు వచ్చి వారు పరిశీలించారు. వేసిన చోటే ఉండడంతో ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకుని ఈ దొంగతనానికి పాల్పడినట్టు భావిస్తున్నారు. ఒకవేళ ఇంట్లో ఎవరైనా ఉంటే న్యూస్ పేపర్ అక్కడ ఉండేది కాదు. నిజానికి ఆ ఇంటి వారు ఏ వార్తా పత్రికను కూడా తెప్పించుకోవడం లేదు.


More Telugu News