స్కూలులో బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్లు అందించాలి.. ఆ దిశగా ప్రభుత్వాలను ఆదేశించండి: సుప్రీంకోర్టులో పిటిషన్

  • బాలికల కోసం స్కూలు ఆవరణలో ప్రత్యేకంగా టాయిలెట్, ఏర్పాటు చేసేలా చూడాలన్న పిటిషనర్
  • నెలసరిపై బాలికలలో అవగాహన పెంచే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
  • పేదరికం వల్ల శుభ్రతపైన వాళ్లు దృష్టి పెట్టలేకపోతున్నారని వ్యాఖ్య 
స్కూలులో చదివే బాలికలకు శానిటరీ ప్యాడ్లు ఉచితంగా అందించేలా ప్రభుత్వాలను ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆరు నుంచి 12 వ తరగతి చదువుతున్న బాలికలకు నెలనెలా ప్యాడ్లు అందించేలా చూడాలని పిటిషనర్ కోరారు. నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు, నివాసం ఉంటున్న పరిసరాలు.. తదితర కారణాల వల్ల చాలమంది బాలికలకు నెలసరి సమయంలో పరిశుభ్రత గురించి అవగాహన ఉండట్లేదని పిటిషనర్ జయ ఠాకూర్ పేర్కొన్నారు.  

పేదరికం వల్ల శుభ్రతపైన వాళ్లు దృష్టి పెట్టలేకపోతున్నారని కోర్టుకు వివరించారు. దీనివల్ల 11 నుంచి 18 ఏళ్ల వయసున్న బాలికలలో చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారని జయ ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా మధ్యలోనే చదువుమానేస్తున్నారని చెప్పారు. వీటన్నిటికి పరిష్కారంగా యుక్త వయసు బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్లు అందించాలని ప్రభుత్వాలను ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ, ఎయిడెడ్, రెసిడెన్షియల్ స్కూళ్లలో బాలికల కోసం ప్రత్యేకంగా టాయిలెట్ తో పాటు ఓ క్లీనర్ ను ఏర్పాటు చేసేలా చూడాలని జయ కోర్టును కోరారు. నెలసరి విషయంలో బాలికలకు అవగాహన కల్పించాలని, ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలని ఆదేశించాలని జయా ఠాకూర్ ఈ పిటషన్ లో కోరారు.


More Telugu News