కొనసాగుతున్న 'కాంతార' జోరు .. 300 కోట్లకి పైగా వసూళ్లు!

  • హీరోగా రిషబ్ శెట్టి విశ్వరూపమే 'కాంతార'
  • దర్శకుడిగాను అందుకున్న బ్లాక్ బస్టర్ 
  • కథానాయికగా అలరించిన సప్తమి గౌడ 
  • వసూళ్ల పరంగా తగ్గని దూకుడు  
రిషబ్ శెట్టి - సప్తమి గౌడ జంటగా నటించిన 'కాంతార' కన్నడలో సెప్టెంబర్ 30వ తేదీన విడుదలైంది. తొలి రోజునే అక్కడ ఆ సినిమా రికార్డుస్థాయి వసూళ్లను చూడటంతో, 15 రోజుల తరువాత తెలుగుతో పాటు ఇతర భాషల్లోను విడుదల చేశారు. 'కేజీఎఫ్' సినిమాను నిర్మించిన బ్యానర్ కావడంతో, ఇతర భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి బడా సంస్థలు పోటీ పడ్డాయి. ఏ భాషలో విడుదల చేస్తే ఆ భాషలో ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. 

ఇంతవరకూ ఈ సినిమా 300 కోట్లకి పైగా వసూళ్లను సాధించినట్టుగా, తాజాగా ఈ సినిమా టీమ్ అధికారిక పోస్టర్ ను వదిలింది. ముందుగా ఈ  సినిమాను కన్నడలో మాత్రమే రిలీజ్ చేయాలనుకున్నారు. అందువల్లనే కన్నడ ప్రాంతానికి చెందిన ఆచార .. విశ్వాసాలతో కూడిన కథను ఎంచుకున్నారు. ప్రధానమైన కథ అంతా కూడా అక్కడ లోకల్ గా ఉండే జానపదుల విశ్వాసం చుట్టూ తిరుగుతుంది. అందువలన అక్కడి ప్రేక్షకులకు వెంటనే కనెక్ట్ అయింది.

అయితే ప్రతి ప్రాంతంలోను కొన్ని ఆచారాలు .. విశ్వాసాలు ఉంటాయి గనుక, సినిమాలో చూపించే విశ్వాసం అక్కడి ప్రజల పధ్ధతిగానే భావించి ప్రేక్షకులు చూశారు. ఇక ఆ అంశం చుట్టూ రిషబ్ శెట్టి నడిపించిన ఆసక్తికరమైన కథనం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచింది. అడివి నేపథ్యంలో .. అమాయక గిరిజనులకు అన్యాయం తలపెడితే అక్కడి గ్రామదేవత అక్రమార్కులకు ఎలా బుద్ధి చెప్పిందనే ఈ కథ చాలా ఫాస్టుగా కనెక్ట్ అయింది. అందువల్లనే ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని సాధించింది.


More Telugu News