టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఎర వ్యవహారం.. తాము చూపించే పాన్ ఇండియా సినిమాలో దిగ్భ్రాంతికర దృశ్యాలుంటాయన్న కేటీఆర్

  • తాము చూపించే సినిమాలో విస్ఫోటక సమాచారం ఉంటుందన్న కేటీఆర్
  • మునుగోడు ఎన్నిక ఫలితం బీఆర్ఎస్‌కు పునాది అవుతుందన్న మంత్రి
  • మునుగోడులో నడ్డా సమక్షంలో ఆ నలుగురినీ చేర్చుకోవాలనుకున్నారన్న కేటీఆర్
  • రాహుల్ గాంధీ గుజరాత్ ఎన్నికలను గాలికొదిలేశారని విమర్శ
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారంపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి త్వరలోనే పాన్ ఇండియా సినిమా చూపిస్తామని, అందులో విస్ఫోటక సమాచారంతోపాటు దిగ్భ్రాంతి కలిగించే అంశాలు ఉంటాయని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికకు ముందే తమ ఎమ్మెల్యేలు నలుగురిని చేర్చుకోవడం ద్వారా టీఆర్ఎస్‌ను నైతికంగా దెబ్బకొట్టాలన్న బీజేపీ పన్నాగాన్ని తిప్పికొట్టినట్టు చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో మునుగోడులో సభ నిర్వహించి ఆ నలుగురినీ పార్టీలో చేర్చుకోవాలనుకున్నారని, కానీ బెడిసికొట్టడంతో సభను రద్దు చేసుకున్నారని అన్నారు. 

నడ్డా, షా అందుకే రాలేదు
మునుగోడు ఉప ఎన్నిక ఫలితం బీఆర్ఎస్‌కు పునాది అవుతుందని కేటీఆర్ అన్నారు. సరైన నాయకత్వం, పోరాట పటిమ లేని కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉండడం బీజేపీ అదృష్టమని మంత్రి పేర్కొన్నారు. తమ ఎమ్మెల్యేలకు ఎరకు సంబంధించి త్వరలోనే మొత్తం సినిమా బయటకు వస్తుందని అన్నారు. మునుగోడులో ఓటమి ఖాయమనే నడ్డా, అమిత్ షా ప్రచారానికి రాలేదని అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు మఠాధిపతులను వినియోగించుకోవడం ద్వారా హిందూ మతానికి బీజేపీ చెడ్డపేరు తెస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. 

దేహదారుఢ్యం కోసమే రాహుల్ పాదయాత్ర
బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన కేటీఆర్.. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌పైనా తీవ్ర విమర్శలు చేశారు. దేహదారుఢ్యం కోసమే రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ బిజీగా ఉంటే రాహుల్ మాత్రం ఇతర ప్రాంతాల్లో తిరుగుతున్నారని అన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కోల్పోతోందన్నారు. 

గవర్నర్ ఎక్కువగా ఊహించుకుంటున్నారు
తెలంగాణ గవర్నర్ తమిళిసై పైనా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌వి నామమాత్రపు అధికారాలు మాత్రమేనని అన్నారు. ఆమె తన స్థాయిని పరిధికి మించి ఊహించుకుంటూ ప్రజా ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నారని విమర్శించారు. గవర్నర్ ఆమోదించకున్నా బిల్లులు అమలవుతాయని కేటీఆర్ తేల్చిచెప్పారు. గుజరాత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయడంపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదన్నారు. తొలుత ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోనే పోటీ చేయాలని భావిస్తున్నట్టు కేటీఆర్ చెప్పారు.


More Telugu News