ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్ పై 5 పరుగుల తేడాతో నెగ్గిన భారత్

  • అడిలైడ్ లో మ్యాచ్
  • వర్షం కారణంగా బంగ్లా లక్ష్యం కుదింపు
  • 16 ఓవర్లలో 151 పరుగులుగా నిర్దేశం
  • 16 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు చేసిన బంగ్లాదేశ్
టీ20 వరల్డ్ కప్ లో భారత్ మరో విజయం సాధించింది. బంగ్లాదేశ్ పై కాస్త కష్టంగానే అయినా, డక్ వర్త్ లూయిస్ విధానంలో ఐదు పరుగుల తేడాతో నెగ్గి సెమీస్ రేసులో ముందంజ వేసింది. 

అడిలైడ్ లో నేడు జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు టీమిండియాను ఓడించినంత పనిచేసింది. వర్షం కారణంగా లక్ష్యాన్ని 16 ఓవర్లలో 151 పరుగులకు కుదించగా, బంగ్లాదేశ్ 6 వికెట్లకు 145 పరుగులే చేసి ఓటమిపాలైంది. చివరి ఓవర్లో 6 బంతుల్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా, అర్షదీప్ బౌలింగ్ చేశాడు. బంగ్లా బ్యాట్స్ మన్ నూరుల్ హుస్సేన్ ఓ సిక్స్, ఫోర్ బాదినా ఫలితం లేకపోయింది. 

ఈ మ్యాచ్ లో వర్షం పడకముందు 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసి పటిష్ఠస్థితిలో ఉన్న బంగ్లాదేశ్... మ్యాచ్ మళ్లీ ప్రారంభమయ్యాక వికెట్లు కోల్పోయింది. మాంచి దూకుడు మీదున్న బంగ్లా ఓపెనర్ లిట్టన్ దాస్ (60)ను కేఎల్ రాహుల్ ఓ డైరెక్ట్ త్రోతో రనౌట్ చేయడం మ్యాచ్ ను మలుపు తిప్పింది. టీమిండియా బౌలర్లలో అర్షదీప్ 2, హార్దిక్ పాండ్యా 2, షమీ 1 వికెట్ తీశారు.

ఈ విజయంతో గ్రూప్-2లో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ప్రస్తుతం రోహిత్ సేన 4 మ్యాచ్ ల్లో 3 విజయాలు, ఒక ఓటమితో టాప్ లో నిలిచింది.


More Telugu News