రోజుకు 12 గంటలు పని చేస్తారా? లేక ఇంటికెళ్తారా?.. ట్విట్టర్ సిబ్బందికి మస్క్ హుకుం

  • ప్రతి రోజూ 12 గంటలు పని చేయాలని స్పష్టం చేసిన మస్క్
  • ఉద్యోగులకు ఆదేశాలు ఇస్తున్న సంబంధిత మేనేజర్లు
  • ట్విట్టర్ లో మరికొందరు కీలక అధికారుల రాజీనామా
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఆ సంస్థ ఉద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. సంస్థను హస్తగతం చేసుకున్న తొలి రోజే సీఈవో పరాగ్‌ అగర్వాల్‌, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ నెడ్‌ సెగల్‌, పాలసీ చీఫ్‌ విజయా గద్దెలపై వేటువేసిన ఆయన మిగతా వారికి హెచ్చరికలు పంపారు. 75 శాతం ఉద్యోగులను తొలగిస్తారన్న పుకార్ల నేపథ్యంలో కంపెనీలో పని చేసే వారు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ వార్తలను మస్క్ ఖండించినప్పటికీ ఉద్యోగులపై మరో పిడుగు వేశారు. 

కంపెనీలో పనిచేస్తున్న కొంతమంది ఇంజనీర్లను రోజుకు 12 గంటలు పనిచేయాలని హుకుం జారీ చేశారు. అదేవిధంగా ఏడు రోజులూ పనిచేయాల్సిందేనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. లేదంటే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరికలు ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు కంపెనీ అధినేత మస్క్‌ నుంచి మేనేజర్లకు ఇప్పటికే అంతర్గత ఆదేశాలు అందినట్టు సమాచారం. దాంతో, మస్క్ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి వారంలో ప్రతి రోజూ 12 గంటలు పని చేయాలని ఉద్యోగులకు సంబంధిత మేనేజర్లు చెబుతున్నారు.

 మరోవైపు ఎలాన్‌ మస్క్‌.. కంపెనీలో సమూల మార్పులు చేపడుతున్నారు. కానీ, మస్క్ వచ్చిన తర్వాత ట్విట్టర్లో కీలక అధికారులు వరుసగా వైదొలుగుతున్నారు. తాజాగా ట్విట్టర్‌ చీఫ్ కస్టమర్ ఆఫీసర్, ప్రకటనల విభాగం అధిపతి సారా పెర్సోనెట్‌, చీఫ్‌ పీపుల్ అండ్ డైవర్సిటీ ఆఫీసర్ దలానా బ్రాండ్, కోర్ టెక్నాలజీస్ జనరల్ మేనేజర్ నిక్ కాల్డ్‌వెల్ తమ పదవులకు రాజీనామా చేశారు. వీరితో పాటు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ లెస్లీ బెర్లాండ్, ట్విటర్ ప్రొడక్ట్ హెడ్ జే సుల్లివన్, గ్లోబల్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ జీన్-ఫిలిప్ మహ్యూ కూడా వైదొలుగుతున్నట్టు ప్రకటించారు.


More Telugu News