నాన్సీ పెలోసీ భర్తపై దాడి కేసు.. వెలుగులోకి మరో కీలక విషయం

  • పాల్ పెలోసీపై దాడి సందర్భంగా నాన్సీ ఎక్కడంటూ నిందితుడి కేకలు
  • దాడి రాజకీయ ప్రేరేపితమన్న కోణంలో విచారణ
  • నిందితుడిపై మరో రెండు అభియోగాల నమోదు
అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ భర్త పాల్ పెలోసీపై దాడి కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. నాన్సీని కిడ్నాప్ చేసేందుకే నిందితుడు ఆమె ఇంట్లోకి చొరబడినట్టు అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. శాన్‌ఫ్రాన్సిస్కోలోని పెలోసీ ఇంట్లోకి గత శుక్రవారం చొరబడిన నిందితుడు డేవిడ్ డెపాపె (42) పాల్ పెలోసీ (82)పై సుత్తితో దాడిచేశాడు. ఈ సందర్భంగా నాన్సీ పెలోసీ ఎక్కడంటూ పెద్దగా కేకలు వేశాడు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడేనని పోలీసులు చెబుతున్నారు. 

నిందితుడిపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ అదనంగా మరో రెండు అభియోగాలను మోపింది. అందులో ఒకటి అధికారుల విధులను ఆటంకపరిచేందుకు కుటుంబ సభ్యులపై దాడి చేయడం కాగా, రెండోది నాన్సీని కిడ్నాప్ చేయడం. నిందితుడి నుంచి ఒక టేప్ రోల్, తాడు, సుత్తిని స్వాధీనం చేసుకున్నారు. నాన్సీని అతడు బందీగా పట్టుకోవాలన్న ఉద్దేశంతో ఆమె ఇంట్లోకి చొరబడినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ దాడి రాజకీయ ప్రేరేపితమని భావిస్తున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News